దర్శనీయ శివాలయాలు చిత్తూరు జిల్లా 46-భక్త కోటేశ్వర స్వామి –బత్తినయ్య కోన

దర్శనీయ శివాలయాలు

చిత్తూరు జిల్లా

46-భక్త కోటేశ్వర స్వామి –బత్తినయ్య కోన

చిత్తూరు జిల్లా కాళహస్తి కి దగ్గరలో బత్తినయ్య కొనలో శ్రీ కోటేశ్వర క్షేత్రం ఉంది .దీనికి విచిత్రమైన స్థల పురాణం కూడా ఉన్నది .బత్తినయ్య అనే ఒక మహా పురుషుడు ఇక్కడి ధనికొండ పై తపస్సు చేశాడు .తర్వాత తిరుమల వెళ్లి బాలాజీ ని దర్శించి కాళహస్తి చేరి అక్కడున్న అగస్త్యేశ్వర పర్వతాలను మూడే మూడు అంగలలో దాటి కొండ గుహ చేరాడు  .దీనికి సాక్ష్యం గా ముసలిపేడు అనే ఊరి చెరువు గట్టున ఒకపాడం ,మొనగాడి గు౦ట అనే ప్రదేశం లో రెండవ పాదం ,కొండ గుహ వద్ద మూడవ పాదం ముద్రలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి .వీటిని భక్తులు భక్తితో ఇప్పటికీ పూజిస్తూ ఉంటారు .బత్తినయ్య స్వామి ఆ కొండ గుహ లో తపస్సులో లీనమైపోయాడు .ఆయన చుట్టూ విపరీతంగా పుట్ట చెట్లు పెరిగాయి . .కొన్ని యుగాలు ఇలా గడిచాయి .ఒక సారి ఒక ఏనాది దంపతులు తేనే ,దుంపల సేకరణకు ఇక్కడికి వచ్చి ఆ గుహలోనే కొద్దికాలం ఉన్నారు .ఒక రోజు విపరీతంగా వర్షం కురిసి బయటికి వెళ్ళే వీలు కాలేదు. గుహలో ఉన్న పుట్ట త్రవ్వితే ఏదైనా ఆహారం దొరుకు తుందేమోనని గడ్డ పార తో  త్రవ్వటం ప్రారంభించారు .పార దెబ్బ బత్తినయ్య తలకు తగిలి రక్తం కారింది .పారతో కొట్టిన ఏనాది వాడి కళ్ళు పోయాయి .అప్పుడు పుట్టలో ఎవరో మహాను భావుడు ఉండి ఉంటాడని గ్రహించి తాము తెలియక చేసిన తప్పును మన్నించమని వేడుకొన్నారు ఆయనకు దయ కలిగి మన్నించ గానే  కంటి చూపు వచ్చింది .మరీ ఆశ్చర్య పోయారు .అప్పుడు పుట్టలో ఉన్న బత్తినయ్య స్వామి తాను  కలియుగం లో భక్త కోటేశ్వరుడిగా లింగ రూపం లో వెలుస్తానని ,ఈవిషయం కొండదిగి ఊర్లో జనానికి చెప్పమని ఆదేశించాడు ..అది అంతా కీకారణ్యం కొండ దిగి మళ్ళీ పైకి రావటం ఎవరి తరమూకాదని ఏనాది దంపతులు విన్న వించారు .అప్పుడు బత్తినయ్య స్వామి ‘’భక్తులు ఎడ్ల బండ్లలో కొండ దిగువ వరకు వచ్చి ,అక్కడ ఎడ్లను వదిలిపెడితే అవి సరాసరి నా సన్నిధికే చేరుతాయి .ఎడ్ల వెనుక భక్తులు కొండ ఎక్కి రావచ్చు ‘’అని ఉపాయం చెప్పాడు . ఏనాది దంపతులు కొండదిగి ఊర్లోకి వెళ్లి జరిగినదంతా ప్రజలకు వివరించి చెప్పారు అంతే జనం తండోప తండాలుగా బళ్ళలో కొండ దిగువకు వచ్చి ,ఎడ్లను వదిలేశారు .అవి ఎక్కే మార్గం ద్వారా అనుసరించి కొండపైకి స్వామి సన్నిధి చేరారు .అక్కడ స్వామిని పూజించారు .వృద్ధ ఏనాది దంపతులు కొండమీదే ఉండి భక్త కోటేశ్వర స్వామి సేవలో ,పూజలో ధన్యమై ఆయనలో లీనమైపోయారు .వారి శిలాప్రతిమలు అక్కడేర్పడ్డాయి ..భక్త కోటేశ్వర లింగ దర్శనానికి వచ్చే వారు ముందుగా వృద్ధ దంపతుల శిలా విగ్రహాలను దర్శించి పూజించి ఆ తర్వాతే భక్త కోటేశ్వర స్వామిని దర్శించాలని బత్తినయ్య స్వామి నియమం పెట్టాడు .అప్పటినుంచి అలానే చేస్తున్నారు భక్తులు .ప్రతి సోమవారం భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది .

47-అర్ధ నారీశ్వర దేవాలయం –విరూపాక్ష పురం

కాళహస్తి దగ్గర తొట్టం బేడు మండలం విరూపాక్ష పురం స్వర్ణ ముఖి నది ఒడ్డున  లో పురాతన శ్రీ అర్ధనారీశ్వర దేవాలయం ఉంది .దీనికి సంబంధించిన స్థల చరిత్ర కూడా ఉంది .పూర్వం అవ౦ తనగరం లో విజయ, శుభగ అనే దంపతులు  ఉండేవారు .విజయుడికి శివ భక్తిఎక్కువ .ఒకసారి ఈ దంపతులు  మార్కండేయ మహర్షిని దర్శించి ఆయన సలహా మేరకు కాళహస్తి వచ్చి ప్రసూనా౦బా  సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసి పూజించారు .ఒక రోజు కలలో శివుడు ప్రత్యక్షమై స్వర్ణ ముఖీ తీరం లో ఉన్న శ్రీ అర్ధనారీశ్వర స్వామి ని దర్శించి పూజించి తరించమని చెప్పాడు .విజయుడు భార్యాసమేతంగా  మర్నాడే  కాలి నడకన  బయల్దేరి  ఇక్కడి ‘’పాప విచ్చేద క్షేత్రం ‘’చేరి స్వామిని నిష్టగా కొలిచాడు ..భార్య  సుభగ ప్రతి రోజు 108శివలింగాలను బంక మట్టి తో చేసి శివార్చన చేసేది .దంపతుల అనన్య భక్తికి మెచ్చి  కాళహస్తీశ్వర స్వామి శ్రావణ పౌర్ణమినాడు దర్శనమిచ్చాడు .స్వామిని అనేక విధాల కీర్తించారు .ప్రీతి చెంది విజయుడు పూజిస్తున్న శివలింగం లో తానూ ,పార్వతీ దేవి సదా నిలిచి ఉంటామని ,ఆ రోజు నుంచి ఈ లింగాన్ని ‘’సుభగాంబ సమేత శ్రీ విజయేశ్వర స్వామి ‘’అని పిలుస్తారని ,భక్తుల కోర్కెలను తీరుస్తానని వరమిచ్చాడు .ఇక్కడ చేసిన దానం తపస్సు యజ్ఞం శ్రీ కాళహస్తి లో చేసిన వాటివల్ల వచ్చే ఫలితంతో సమానంగా ఉంటాయని అభయ మిచ్చాడు .తర్వాత విజయ సుభగ దంపతులను  తనలో ఐక్యం చేసుకొన్నాడు కాళహస్తీశ్వర స్వామి  ఇదే ఇప్పుడు మనం చెప్పుకొంటున్న అర్ధనారీశ్వర దేవాలయం .

ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండిగర్భాలయం లో ‘’సుభగా౦బా సమేత శ్రీ విజయేశ్వర స్వామి గా స్వయంభు లింగం ఉన్నది .ఈ లింగానికి రెండు ముఖాలు ఉండటం ఒక విశేషం .శివుని భాగం తెల్లగా ఉంటె ,రెండవ భాగమైన దేవీ భాగం పసుపు రంగులో ఉండటం అంతకంటే ఆశ్చర్య పరుస్తుంది .శుక్ర ,సోమవారాల్లో విశేషంగా భక్తులు వస్తారు .ఏకాదశి కృత్తికా నక్షత్రం సూర్య ,చంద్ర గ్రహణాలలో శివరాత్రి కార్తీక పర్వ దినాలలో విశేష పూజలు అభిషేకాలు ఉత్సవాలు ఉంటాయి .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-15-ఉయ్యూరు  ‘’

 

 

 

 

 

 

 

 

 

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.