దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –2 235— శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం –రాగి గుడ్డ –బెంగుళూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –2

235— శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం –రాగి గుడ్డ –బెంగుళూరు

రాగి ధాన్యం గుట్ట ఆంజనేయ విగ్రహం గా మారటం

కర్నాటక రాష్ట్రం లో బెంగుళూరు మహానగరం లో జయనగర్ ప్రాంతం లో తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు .జయనగర్ దగ్గరున్న రాగి గుడ్డ (గుట్ట) దగ్గర శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది .బెంగుళూరు వెళ్ళిన పర్యాటకులు తప్పని సరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు .కోరిన కోర్కెలు తీర్చే దైవం గా ఈ స్వామిని భావిస్తారు .ఆలయం అయిదు ఏక రాల సువిశాల ప్రదేశం లో ఉంది ..ఒకప్పుడు ఇక్కడి రైతులు తమ పొలాలలో పండిన రాగి ధాన్యాన్ని ఇక్కడ ఒక కుప్ప గా పోస్తే అది ఆంజనేయ స్వరూపం గా మారి పోయి దర్శన మిచ్చాడట .అందుకనే ఈ క్షేత్రానికి రాగి గుట్ట లేక రాగి గుడ్డ ఆంజనేయ స్వామి క్షేత్రం అని పేరు వచ్చిందట .

యువకులు కట్టిన ఆలయం –నేడు ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటైంది

ఈ క్షేత్రం ఊరికి చాలా దూరం గా ప్రశాంత వాతావరణం లో ఎత్తైన ప్రదేశం లో ఉండటం ప్రత్యేకత .అక్కడ ఎన్నో రకాల ఫల వృక్షాలు పూల చెట్లు ఉండి ఎంతో రమణీయం గా ఉంటుంది .చూడదగ్గ క్షేత్రం .ఆంజనేయ  ఆలయం తో  బాటు ,విఘ్నేశ్వర ,రాజ రాజేశ్వరి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి . రాగి  గుడ్డ పై వెలసిన హనుమకు ఆలయం కట్టించటానికి సుమారు యాభై ఏళ్ళ క్రితం కొందరు యువకులు నడుం కట్టి పూను కొన్నారు .ప్రజలందరినీ సమీకరించి అందరి సహకారం తో ఇక్కడ ఆలయ నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తీ చేశారు .ఇప్పుడు ఈ ఆలయం బెంగుళూరు లో నే ఒక ప్రసిద్ధ దేవాలయం గా విరాజిల్లుతోంది .ఇక్కడి ఆలయ సముదాయాలన్నీ ఒకే విధంగా ఉండి చూపరులకు పరమ వైభవ వోపెతంగా కనిపిస్తాయి .శారీరక ,మానసిక ప్రశాంతతకు  ఈ క్షేత్రం  నిలయమై విరాజిల్లుతోంది .ఇక్కడ  స్వామివారి  గర్భ గుడిలో  ఉన్నంత సేపు బాహ్య ప్రపంచం కనిపించనే కనీ పించదు. కొండపైకికష్ట పడి మెట్లు ఎక్కి వచ్చి స్వామిని దర్శించాలి .మోకాళ్ళ నొప్పులతో బాధ పడే వాళ్ళు సైతం మనసారా స్వామిని స్మరించి ఎక్కటం ప్రారంభిస్తే అలసట లేకుండా ఎక్కు తారు .అదీ ఇక్కడి జన విశ్వాసం .ఇదే స్వామి వారి మహిమ గా భక్తులు గుర్తిస్తారు దీనికి ఎందరో భక్తుల అనుభవాలే సాక్షాలు .చీడ ,పీడా రోగాలబారిన పడిన వారిని స్వామి ఆదుకొని బాధా నివృత్తి చేస్తాడు .గాలి ధూళి భయాలను పోగొడతాడు .భక్తులు తమ వాహనాలపై స్వామి చిత్రం స్టిక్కర్ అంటించుకొని ప్రమాదాల నుండి రక్షించుకొంటారు .ప్రతి మంగళ శనివారాలలో స్వామికి తమల పాకు పూజలు చేస్తారు వడమాల వేస్తారు .

ఉత్సవాలు

రాగి గుడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి ని 12 రోజులు మహా వైభవం గా నిర్వహిస్తారు .పన్నెండు రోజల్లో స్వామికి పన్నెండు అలంకారాలతో ముస్తాబు చేస్తారు .శ్రీరామనవమికి సీతా రామ  కల్యాణోత్సవం జరుపుతారు .ఇక్కడి వినాయకస్వామిని దర్శించి పూజిస్తే పనులలో ఏర్పడ్డ  విఘ్నాలు తొలగిపోతాయన్న నమ్మకం ఉంది .ఇక్కడ చేసే గణపతి హోమానికి ప్రత్యేకత ఉంది .అలాగే అమ్మవారు శ్రీ దేవీ రాజ రాజేశ్వరికి నవ రాత్రి ఉత్సవాలను కూడా ఘనం గా నిర్వహిస్తారు .

త్రిమూర్తులు దర్శించిన క్షేత్రం

రాగి గుడ్డపై  శ్రీ ఆంజనేయ స్వామి వెలసినప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడికి వచ్చి బస చేశారాని పౌరాణిక కధనం ఉంది .అంతే కాక ఒకే పాన వట్టం పై త్రిమూర్తులు అధిస్టించి ఉండటం మరో గొప్ప ప్రత్యేకత .ఇక్కడ హనుమాన్ ధారా అనే జలపాతం విశిష్టమైనది .యాగ శాల ,గో శాలలు కూడా ఉన్నాయి ఇక్కడి గోశాలలో పెంచే గోవులనుండి పిండిన ఆవు పాలను శ్రీ ఆంజనేయ స్వామి అభిషేకానికి విని యోగిస్తారు .మిగిలిన పాలను నర్సరీ విద్యార్ధులకు ఉచితంగా అంద జేస్తారు .

ఆలయ ట్రస్ట్ సేవలు

ఒక ట్రస్ట్ ఆధ్వర్యం లో ఆలయాన్ని నిర్వహిస్తున్నారు .ఆలయానికి అనుబంధంగా ఒక హైస్కూల్ నడుపుతున్నారు . విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు .ఇంజనీరింగ్ వంటి వ్రుత్తి విద్యా కోర్సుల విద్యార్ధులకు కోచింగ్ ఇస్తారు .వివిధ విద్యా సంస్థలలో పని చేసే ప్రొఫెసర్లు ,లెక్చరర్లు ఇక్కడికి వచ్చి విద్యార్ధులకు శిక్షణ నివ్వటం గమనించ దగిన విషయం .ఈ కేంద్రం లో ఉచితంగా వైద్య సలహాలు ,ఇ.సి .జి. వంటి సదుపాయాలూ ఉన్నాయి .వివేకానంద యోగా కేంద్రం ద్వారా ఉచిత యోగా శిక్షణ నిస్తున్నారు .దక్షిణాది భాషలలోను సంగీతం లోను ఉచిత శిక్షణ నిస్తున్నారు .ఆలయంట్రస్ట్ బోర్డ్  స్వామి సేవలో నే కాక విద్యా వైద్య సేవలోనూ ధన్యమౌతోంది . రాగి గుడ్డ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం సకల పాపహరం ,మనోభీష్ట సిద్ధికరం .

Image result for ragigudda hanuman bangalore  Inline image 1    Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-6-15 –ఉయ్యూరు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.