శ్రీనాధుని భీమ ఖండ కధనం -30 చతుర్దాశ్వాసం -4

శ్రీనాధుని భీమ ఖండ కధనం -30

చతుర్దాశ్వాసం -4

పాలకడలి లో ప్రావిర్భ వించిన విశేష వస్తుజాలం

కాలకూట విషాగ్నిని శంకర మహాదేవుడు భాక్షించగానే ఆయన ఆజ్ఞప్రకారం దేవ దానవులు విఘ్నేశ పూజ చేసిన తర్వాత మళ్ళీ మధనం ప్రారంభించారు .అప్పుడు అందులో నుంచి లేత చంద్ర కళపుడితే దాన్ని భక్తి తో భీమేశునికి సమర్పిస్తే  శిరసున దాల్చి ఇందు మౌళి అయ్యాడు .ఆ తర్వాత కల్పవృక్షం ,అప్సరసలు ,కౌస్తుభ మణి,ఉచ్చైశ్రవం ,ఐరావతం అందులో నుంచి వచ్చాయి .ఇంకా మధించగా అమృత భాన్దాన్ని చేతిలో ఉంచుకొని ధన్వంతరి ఆవిర్భ వించాడు .సముద్ర మాధ్యమం లో నిండు చంద్రుడు ,ఆయనతోబాటు ఒక  తామర పువ్వుపుట్టాయి .చిరుగాలికి తామర వికసించింది .అందులోని పుప్పొడి వాసన నలు దిక్కులా వ్యాపించింది .ఆ పువ్వు మధ్యలో పూజ్యమైన  వలయం ఏర్పడింది. ఆ దుడ్డు పైన శ్రీ లక్ష్మీదేవి ఉదయించింది .ఆమె చేతిలో బంగారు పుష్పమాల ఉంది .ఆమె వెంటనే ఆ మాలను శ్రీ మహా విష్ణువు మెడలో వేసి ఇల్లాలైంది .

విష్ణు మాయ

ధన్వంతరి అమృత భాండం తో ఆవిర్భ వించ గానే దానవులు అమృతం కోసం ధన్వంతరిపై ఎగ బడ్డారు  అమృత భాం డాన్ని లాక్కోని రాక్షసులు పారిపోయారు .అప్పుడు తగువు తీర్చటానికి విష్ణువు మాయోపాయం పన్నాడు .

‘’నారాయణుండు మాయా –నారీ రూపమున గపట నాటక లీలా-

పారాయణత హరించే ,సు –రారులచే నమృత కలశ మా సమయమునన్ ‘’

విష్ణువు మాయా మోహినీ రూపం ధరించి కపట నాటక కళా ప్రాభవం తో రాక్షసుల చేతిలో నుంచి అమృత భాండాన్నిస్వాధీనం చేసకొన్నాడు .దానవులు బిక్కమొహం వేసి  ఏడుస్తున్నారు .అప్పుడు నారదమహర్షి వారి దగ్గరకు వచ్చి నేర్పుగా ఇలా మాట్లాడాడు –

‘’రక్షో  నాయకులార !నిర్జర వర వ్రాతంబు చేతన్  సుధా –భిక్షా పాత్రము వోయె నంచు మదిలో బెగ్గిల్లగా నేటికిన్ ?

రక్షార్ధంబు భజింప రాదే యభావుం ద్రైలోక్య కుక్షిం భరున్ –దక్షారామ పురాధి నాధుని సుదాదామార్ధ చూదామణిన్’’

రాక్షసులారా !దేవ నాయకుల మోసం వల్ల అమ్రుతపాత్ర కోల్పోయామని  దుఃఖించ వద్దు .మీ భద్రత కోసం భవుడు ,మూడులోకాలను అదుపులో పెట్టుకోన్నవాడు చంద్ర శేఖరుడు అయిన దాక్షా రామ భీమేశుని సేవించండి’’ .వెంటనే దానవులు  వెళ్ళారు భీమేశునిసేవించి బలం సైన్యం పెన్చుకొన్నారు .త్రిపురాసురులతోకలిసి పాశుపత నియమాలన్నీ పాటించారు .నిర్మల మనసుతో ఘోర తపస్సు చేయగా లోకాలు అతలాకుతలమైనాయి .వాళ్ళు చేసిన తపస్సు విధానాన్ని శ్రీనాధుడు వర్ణించాడు చూడండి –

‘’అరుణోదయంబున నాకాశ వాహినీ –హేమామ్బుజంబులనిందుధరుని

మిహిరోదయంబున మహి సాక్షి గుగ్గుల – ధూప దూమంబుల దురిత హరుని

సంగవంబున గంధ సార కుంకుమచంద్ర –జంబాలమున  బుష్ప చాప మదను

మధ్యాహ్నమున బక్వ మధురాన్న పాయసా –పూపాజ్య దధి ఫలంబుల ద్రినేత్రు

పరమ సంధ్యాగమం బున బటహ శంఖ –ఝుల్లరీ మడ్డుడమరు ఝార్ఝరుల మ్రోత

నారద రాత్రంబు లందు వీణారవముల –హరుని బూజింతు రతి భాతి నసుర వరులు ‘’

దైత్య నాయులు స్తిరమైన భక్తితో భీమేశ్వరుని తెల్ల వారు ఝామున ఆకాశ గంగలోని కమలాలతో పూజించారు .సూర్యోదయ కాలం లో ధూప ధూమం తోనూ ,సంగవ కాలం లో చందనం కుంకుమ పూవు ,కర్పూరాలతో మధ్యాహ్నం వేళ పొంగలి ,పాయసం ,పిండి వంటలు  నెయ్యి ,పెరుగు ,పండ్లు నైవేద్యం పెట్టి పూజించారు .సాయం సమయం లో దమరువు ,శంఖం ,తప్పెట,డోలు మొదలైన వాటి ధ్వానాలతో సేవించారు .అర్ధ రాత్రి వీణానాదం తో కీర్తించారు  .ఇదంతా శైవులు చేసే ‘’షట్కాల శివార్చన ‘’లాగా ఉంది .

వాళ్ళు పంచ బ్రహ్మ షడంగ ప్రసాద పంచాక్షరీ మంత్రాలు చదువుతూ మారేడు దళాలతో పూజించారు .వేదం పురాణమంత్రలాలను నిరంతరం గానం చేశారు .వీటికి ప్రీతి పొందిన శివుడు వారికి  అశేష సంపదలనిచ్చాడు –అపుడు వారి స్తితి ఎలా ఉందొ తెలుసా-

‘’అపుడు గర్వించి నిర్జించి రఖిల జనుల –నిర్జరుల బాధ పెట్టిరి నిరపరాధ

మప్రతీక మహా వ్రతా పాతిరేక-నిర్విశంకావలేపులై పూర్వ సురులు ‘’

భీమేశ్వర స్వామి అనుగ్రహం తో గర్వించి ,శౌర్యం తో విజ్రు0భించి జంకూ గొంకూలేకుండా ఎదురు లేని ప్రతాపం తో ప్రజలను దేవతలను బాధిస్తూ పీడించారు .ఇక వాళ్ళ గర్వాన్ని హర్వం చేయటానికి తగిన సమయం వచ్చింది .మునులు దేవతలు బ్రహ్మ విష్ణు వులతో కలిసి కైలాసం వెళ్ళారు .ఏం జరిగిందో తర్వాత తెలుసు కొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-11-14-ఉయ్యూరు

,

 

 

 

‘’

 

1 thoughts on “శ్రీనాధుని భీమ ఖండ కధనం -30 చతుర్దాశ్వాసం -4

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.