దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు – 39- మద్ది ఆంజనేయ స్వామి

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –

                     39-   మద్ది ఆంజనేయ స్వామి

పశ్చిమ గోదావరిజిల్లా జంగా రెడ్డి గూడెం మ౦డలం గురువాయి గూడెం గ్రామం లో తెల్ల మద్ది చెట్టు కింద పూజలు అందుకొంటున్న స్వామినే మద్ది ఆంజనేయ స్వామి అంటారు .స్వయంభువు సుప్రసిద్ధుడు .త్రేతాయుగం లో  మధ్వాసురుడు అనే రాక్షసుడు రావణ సైన్యం లో ఉండికూడా శ్రీ ఆంజనేయస్వామిని చూసి ఆయన లో ఐక్యమయ్యాడు .ద్వాపర యుగం లో మద్వి కుని  గా జన్మించి కౌరవుల తరఫున కురుపాండవ యుద్ధం లో పాల్గొన్నాడు .అర్జునుని రధ ధ్వజం పై ఉన్న హనుమాన్ ను దర్శించి ప్రాణాలు విడిచాడు .కలియుగం లో మధ్వడుగా పుట్టి అనేక వేల ఏళ్ళు తపస్సు  చేశాడు .ఆధ్యాత్మిక భావం తో జీవించాడు. ప్రక్కనే ఉన్న ఎర్రకాలువ ఒడ్డున నివాసం ఏర్పరచుకొని తపస్సు చేశాడు .ప్రతి రోజు కాలువ  స్నానం చేసి ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉన్నాడు .ఒక రోజు అలా చేస్తుంటే కాల్వ  లో పడబోయాడు .ఎవరో చేయి పట్టుకొని ఆపేసి నట్లు ఆగిపోయాడు .ఎవరా అని చూస్తె ,ఒక వానరం అలా చేసినట్లు గ్రహించాడు .ఆయనే సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామియే అనుకొన్నాడు .ఆ కోతి మధ్వుడిని ఆశ్రమానికి చేర్చి సపర్యలు చేసి ఉపశమనం కలిగించింది .స్వామి అనుగ్రహం లభించిందని సంతోష పడ్డాడు .తానూ ఇంతకాలం స్వామి చేత సపర్యలు చేయిన్చుకొన్నందుకు బాధ పడి స్వామిని శరణు వేడాడు .ఇక తానూ జీవించటం వృధా అని పాదాల పై పడ్డాడు .అప్పుడు స్వామి అనుగ్రహం తో ప్రత్యక్షమై జరిగిన దానిలో  మధ్వుని తప్పు ఏమీ లేదని  ఆతని భక్తికి మెచ్చి తానె సపర్యలు చేశానని స్వామి చెప్పాడు .వరం కోరుకోమన్నాడు .మధ్వు డు ఎల్లప్పుడు తన చెంతనే ఉండేట్లు వరం ప్రసాదించ మని కోరుకొన్నాడు .స్వామి ‘’నువ్వు ఇక్కడే మద్ది చెట్టు రూపం లో అవతరించు .నేను ప్రక్కనే ఒక చేతిలో ఫలం మరో చేతిలో గద తో శిలా రూపం గా అవతరిస్తాను .ఈ పుణ్య క్షేత్రం నీ పేరుతొ ‘’మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రం’’గా వర్ధిల్లుతుంది ‘’అని అనుగ్రహించాడు . కనుక స్వామి స్వయంభు గా భావిస్తారు .

     ఆలయానికి శిఖరం ,పైకప్పు లేవు .మద్ది చెట్టు బాగా పెరగటం వలన విమానం కట్టటానికి అవకాశం లేదు. భక్తులు కోరిక నేర వేరిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తారు .దీనికి పడమర పురాతన  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయమూ ఉంది .ఏడు మంగళ వారాలు వారానికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి .కుటుంబ ,ఆర్దికాది సమస్యలూ తొలగిస్తాడు .ఏలిన నాటి శని దోషాలు నివారింప బడి అంతాశుభమే జరుగుతుంది .

 
 

        Inline image 2                 40 –Inline image 3

                              40-  బీచుపల్లి ఆంజనేయ స్వామి 

మహబూబా బాద్ జిల్లా  ఇటిక్యాల గ్రామం లో కృష్ణా నది ఒడ్డున బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం పదహారవ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం .కాని తొమ్మిదవ శతాబ్దానికేచోళ సామ్రాజ్యం లో  ప్రాచుర్యం పొందిందని  స్థల చరిత్ర తెలియ జేస్తోంది.స్వామిని ‘’బీచుపల్లి రాయుడు ‘’అని ఆప్యాయం గా భక్తులు పిలుచుకొంటారు .ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది .స్వామిని ఎవరు అర్చన చేయాలని ప్రశ్న వస్తే ,స్వామి సమాధానం గా కలలో కన్పించి ఎవరు ముందు తనను దర్శిస్తే వారితోనే పూజ చేయించాలి అని చెప్పాడట అప్పుడు ఒక బోయవాడు ముందుగా ఆలయానికి వచ్చాడు .అతనితోనే తోలి పూజ చేయించారు .అప్పటినుంచి ఇక్కడ మొదటిపూజ ను బోయ వారె చేసే సంప్రదాయం ఏర్పడింది . అలానే ఇప్పటికీ జరుగుతోంది .బోయ వారి అర్చన అయిన తర్వాతే బ్రాహ్మణ పూజారుల అర్చన ప్రారంభిస్తారు అదీ ఇక్కడి విశేషం .

       వ్యాస రాయల ప్రతిష్టితం  అని తెలుస్తోంది .శ్రీకృష్ణ దేవరాయలు గురువు వ్యాస రాయలవారు  ఇక్కడికి వచ్చి కృష్ణా స్నానం చేసి  తడి బట్టలను శిష్యుడికి ఇవ్వగా అయన నదిలోని ఒక రాయిపై ఉతకటం ప్రారంభించాడు ..ఆ రాతి నుండి యేవో స్పష్టం గా మాటలు వినిపించాయి. రాతినితిప్పి చూడగా శ్రీ ఆంజనేయ స్వామి కనిపించారు. తనను అక్కడే ప్రతిస్టించమని అదృశ్య రూపం లో చెప్పాడు .అ౦ త పెద్ద రాయిని మోసి బయటికి తీయలేక పోయారట .స్వామిని బరువుతగ్గమని వ్యాసరాయలు ప్రార్ధించారు .నిజం గానే బరువు తగ్గి స్వామి భక్త సులభుడు అనిపించుకొన్నాడు .వ్యాసరాయలు శిష్యులతో స్వామి విగ్ర హాన్ని భుజాలపై మోసుకొంటూ బయటికి తెచ్చారు .ఒక రావి చెట్టు దగ్గరకు రాగానే మళ్ళీ స్వామి బరువు పెరిగాడట .అదే అనువైన ప్రదేశం గా భావించి ఆ రావి చెట్టుకిందే స్వామిని శాస్త్రోక్తం గా పూజించి ప్రతిష్టించారు .రెండు వందల ఏళ్ళ క్రితం గద్వాల రాజులు ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి .కృష్ణ పొంగినపుడు నీరు శివలింగాన్ని తాకుతాయి .పుష్కర స్నానాలకు ప్రత్యెక ఘాట్ లను నిర్మించారు .

     గర్భాలయం లో స్వామి విగ్రహం ఉంటుంది ఎడమ వైపు మహేశ్వరలింగం కుడివైపున సీతా లక్ష్మణ సమేత శ్రీ రాముడు కొలువై ఉంటారు .ఆంజనేయ స్వామి పాదాలు దర్శనమిస్తాయి నిత్య పూజలు ఉత్సవాలలో విశేష అర్చనలు జరుగుతాయి వైశాఖ త్రయోదశి నుండి అయిదురోజులు ఉత్సవాలు జరుగుతాయి .పౌర్ణమి నాడు రధోత్సవం విశేషం గా నిర్వహిస్తారు .

Inline image 1  

         సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26 -12-14-ఉయ్యూరు

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.