శ్రీనాధుని భీమ ఖండ కధనం -40(చివరి భాగం ) షస్టాశ్వాసం -3

శ్రీనాధుని భీమ ఖండ కధనం -40(చివరి భాగం )

షస్టాశ్వాసం -3

దాక్షాయణికి ఉత్తరాన వీర భద్ర ప్రతిష్టి తమైన వీరభ ద్రేశ్వర లింగం ,దానికి దగ్గర నిరుతేశ్వర ,పడమర వరుణేశ్వర ,వాయువ్యం లో వాయ్వేశ్వర ,చంద్ర ప్రతిష్టిత సోమేశ్వర లింగాలున్నాయి .వీటిని ఆయా కుండా ల లో స్నానించి దర్శిస్తే మోక్షం .వ్యాస మహర్షి పరమ నిష్ట తో గోదారి తీరం లో తపస్సు చేసి శివ లింగాన్ని ప్రతిస్టించాడు .పంచాక్షరి జపిస్తూ యోగ సమాధి పొంది తాను  ప్రతిష్ట చేసిన లింగాన్ని భక్తితో అర్చిం చాడు .ఒక  రోజు పరమేశ్వరుడు ప్రీతితో ప్రత్యక్షమైనాడు

‘’కురిసెం బువ్వుల వాన మత్త మధులి త్కోహలాన్వితమై –విరిసెం దిక్కులు మంద మంద గతులన్ వీచే న్న్నభ స్వం తుడున్ –మెరసెం దుందుభు లొక్కయుమ్మడి నభో మూర్ధా వకాశంబునం –బోరసేన్ సమ్మద మెల్ల లోకముల కప్పు న్యాహకాలంబు నన్’’

ఆ రోజు పుణ్య సమయం లో మత్తెక్కిన తుమ్మెదలు ఝంకార కోలాహలం చేస్తుండగా పూల వాన కురిసింది .దిక్కులు విక సించాయి ..వాయువు నెమ్మదిగా వీచింది .దేవ దుందుభులు మోగుతుండగా లోకం లో సంతోషం వెల్లి వేరిసింది .అప్సరలు నాట్యమాడారు .గంధర్వులు గానం చేశారు .మునులు అనేక రకాలుగా కీర్తించారు .కొందరు తాండవ మాడారు .కొంత మంది ముష్టి యుద్దాలతో వినోదం కల్పించారు .ప్రత్యక్ష మైన పరమేశ్వరుడు వ్యాసుని ,మిగిలిన ముని దేవతలను ఉద్దేశించి –‘’ఇక్క డున్న వారంతా నా ఆజ్నవినండి .మనసులోని సందేహాలు వదిలేయండి .నేను చెప్పేది వేదం కంటే గొప్పది .సూర్యుడు ఆకాశానికి ఆభరణం అయి నట్లు లోకాలకు దాక్షారం ఆభరణం .భోగ మోక్ష వైభవం .కనుక విశ్వాసం కలిగి ఉండండి .ఎన్ని క్షేత్రాలున్నా ఇదే గొప్పది శ్రేష్టమైనది .అందరూ ఇక్కడే ఉండండి .చెడ్డ వాడైనా ,ముని శ్రేస్టూడైనా ఇక్కడ ఉంటె చాలు ముక్తి పొంద గలడు.అన్ని పాపాలను ఈ క్షేత్రం పరిహారం చేస్తుంది .’’అని ఆజ్ఞా పించి శంకర మహాదేవుడు అదృశ్యమైనాడు .ఆక్కడున్న సనకస సనంద  సనత్కుమార సనత్సుజాత బ్రహ్మ యోగీశ్వరులు ,మార్కండేయ ,మౌద్గల్య ,మాండవ్య ,మంకణమహర్షులు వ్యాస మహర్షిని తమకు  శివ దర్శనం చేయించి నందుకు ప్రశంసలతో ముంచెత్తారు .తర్వాత తమ తమ నివాసాలకు  బయల్దేరి వెళ్ళిపోయారు .

శివుడు చేసిన ఉప దేశాను సారం అందరు నిత్య గోదావరీ స్నానం భీమేశ్వర దర్శనం మిగిలిన దేవ సందర్శనం చేస్తున్నారు .ఇక్కడ లేని దేవత లేదు .ఫలితం అమృతం .అన్ని విద్యలకు సానుకూలమైన ప్రదేశం .వైభవ స్థానం .ఇది శంకరుని అంతః పురం .ఇక్కడ ఉందాం .ఇక్కడి క్షేత్ర  దర్శనం చేసి తీర్ధ స్నానాలు చేసి తరిద్దాం .అని శౌనకాది మునులను వెంట బెట్టుకొని సూత మహర్షి దక్షిణ కాశి అయిన దాక్షారామానికి కాశీ విశ్వేశ్వర సమానుడైన భీమేశ్వర సందర్శనానికి తాము చేస్తున్న పన్నెండేళ్ళ సత్రయాగాన్ని పూర్తీ చేసి  బయలు దేరి వెళ్ళాడు .

భీమేశ్వర పురాణం అనే భీమ ఖండం యాభై ఖండాలతో కూడుకొన్నది .ఇదిస్కాందపురాణం లోని గోదావరీ ఖండం లో చెప్ప బడిన భీమ ఖండం అని ,భీమేశ్వర మహాత్మ్యం అని ,భీమేశ్వర పురాణం అని ప్రసిద్ధి చెందింది .భీమ ఖండాన్ని రాసినా ,చదివినా విన్నా ,పుస్తకాన్ని చేత ధరించినా పూజించినా శ్రీ భీమేశ్వర స్వామి సకల సంపదలు ,ఆయురారోగ్య భోగ భాగ్యాలు మోక్షం ప్రసాదిస్తాడు .

‘’దక్ష వాటీ మహా ప్రస్తానంబు లో లేని –యమరులేస్తానంబు నందు లేరు –ధక్ష వాటీ మహా స్తానంబులో లేని –యర్ధమే స్థానంబు నందు లేదు –దక్ష వాటీ మహా స్థానంబు లో లేని  యమ్రుతమే స్థానంబు నందు లేదు –దక్ష వాటీ మహాస్థానంబు లో లేని –యజ్నమే స్థానంబు నందు లేదు –దక్ష వాటిక సకల విద్యలకు గరిడి –దక్ష వాటిక విభవంబు తానకంబు –దక్ష  వాటిక శివుని యంతః పురంబు ‘’

శ్రీ నాధుని భీమ ఖండ కధనం సర్వం సంపూర్ణం

సర్వే జనా స్సుఖినో  భవతు

  Inline image 1

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-11-14-ఉయ్యూరు

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.