శ్రీనాధుని భీమ ఖండ కధనం -17 తృతీయాశ్వాసం -2

శ్రీనాధుని భీమ ఖండ కధనం -17

తృతీయాశ్వాసం -2

వ్యాసుని శంకా నివృత్తి చేస్తూ అగస్త్యుడు ‘’వేద విభాగం ,మహా భారత రచనా,అష్టాదశ పురాణ నిర్మితి ,బ్రహ్మ సూత్రా సంగ్రధానం  చేసిన వ్యాసమహర్షీ !నీకు తెలియని పుణ్య తీర్దాలు భూ మండలం లో ఉన్నాయా?భీమేశ్వర లింగ మహిమ నీకు తెలియనిదికాదు .అవమానం పొందిన మనసుతో ఏదీ తెలియని వాడిలాగా అడుగుత్న్నావు .అయినా అడిగావుకనుక ఆ క్షేత్రమహిమను చేబుతానువిను .దాక్షారామ భీమేశ్వరాలయం ముల్లోకాలకు కను విందు .మహత్తర సౌందర్యం తో సాక్షాత్తు పర బ్రహ్మ నివాసం లాగా మోక్ష స్థానం లాగా స్వర్గం వలే సమస్త భోగాలకు నిలయమై ఉంది .సప్త మహర్షులు తపస్సుతో ఏర్పడిన సప్త గోదావరి భగీరధుడు తెచ్చిన గంగకు ఏ మాత్రమూ సాటికానే కాదు .దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞం చేసిన పవిత్ర ప్రదేశం ఇది .బ్రహ్మ విష్ణు ,ఇంద్రాదులకు మహర్షులకు సభా భవనమైనది .దక్ష పుత్రిక సతీదేవి యోగాగ్ని జ్వాలను పెంచటానికి ‘’సామిదేని ‘’అనే రుక్కుల సమూహానికి కారణ భూమి .వీరభద్ర విజయ నాటకానికి రంగ స్థలం .అమృతమయం దివ్య తేజోమయం అయిన స్వయంభు లింగమైన భీమేశ్వర స్వామికి స్థానమైనది ,భోగానికే కాక మోక్షానికీ భూమి అయింది దాక్షారామం .’’సామిధేని అంటే కొంత వివరణ కావాలి –సోమం మొదలైన యాగాలలో ‘’ఘర్మం ‘’అనే పాత్ర లో నెయ్యిని మరిగించి ,ఇంకొక పాత్రతో ఆ కాగే మరిగే నెయ్యిలో పాలు పోసి చిలుకుతారు .అప్పుడు విపరీతం గా మంటలు చేల రేగుతాయి .వాటిని అణచటానికి చేటలతో విసురుతారు . ఈ జ్వాలా ప్రజ్వలన సమయం లో రుగ్వేదమంత్రాలను చదువుతారు .వీటికే సామిధేనీ మంత్రాలని లేక ‘ధాయ్యా ‘’మంత్రాలనీ అంటారు .

అగస్త్యుడు మళ్ళీ చెబుతూ ‘’భీమేశ్వరుడు సూర్య ప్రతిష్టితుడు .ఇంద్రాది దేవతల నమస్సుల నందు కొంటాడు ఆతలా మొదలైన ఏడు పాతాళలోకాలను  చేదిమ్చుకొని స్వామి ఆవిర్భవించాడు .దివ్య జ్యోతిర్లింగ స్వరూపుడు .భోగ మోక్షలాను ఏక కాలం లో ఇచ్చే దొడ్డ వేల్పు .భీమ మాండలం అనే పేరుతొ పన్నెండు ఆమడల మేర మోక్షానికి ,కల్యాణానికి మంటపం .లక్ష్మీ దేవికి క్రీడా భూమి .కుండలా ముఖం ,సంవేద్యం ,శార్దూలం మొదలైనప్రముఖ  తీర్ధాలతో బాటు ఇంకా అనేక తీర్దాలు వెలసిల్లిన ప్రదేశం .దక్షిణ సముద్ర తీరం లో వినాయకుడు తొండం తో సప్త గోదావరీ జలాన్ని పీల్చి వెదజల్లెనీటి ధారలు బ్రహ్మాండమంతా వ్యాపిస్తాయి .తుల్య భాగా నదీ తరంగా ఘోష ఆకాశాన్ని చేరుతుంది .ఏలా నదీ జలాలతో ఇక్కడ బంగారపు పంటలే పండుతాయి .ఫల ,పుష్పాలతో కొబ్బరి చెట్లతో  శోభాయమానం గా ఉంటుంది .పిఠాపురానికి అవతల ఉన్నదే భీమ మండలం .గోదావరీ మాత ఆశీస్సులతో బ్రాహ్మణులు నిరంతర యజ్న యాగాలు చేస్తూ ఉంటె హవిస్సులు గ్రహిం చటానికి ఆకాశం లో దేవతలు క్యూలో కిక్కిరిసి ఉంటారు .కౌన్తేయ నదీ తీరం లో మామిడి పండ్ల రసాన్ని ఆస్వాదిస్తూ మగ కోకిలలు మధురగానాలు చేస్తూంటాయి .

ఈ భీమ మండలం లో హరి వంశానికి చెందినబల రాముడు ,ప్రద్యుమ్నుడు ,అని రుద్దుడు ,శ్రీ కృష్ణ్డు ఉన్నట్లుగా ఇక్కడ బలమైన పురుషులు ఉన్నారు. ఇన్ని గొప్ప లక్షణాలు ఈ క్షేత్రానికి ఉన్నాయి అందుకే దాక్షారామం దక్షిణ కాశి అయింది .కైలాసానికి ప్రతి బింబం అని పించుకోన్నది .ఇక్కడ నాశనం లేని ఐశ్వర్యం ఉంది .సాటిలేని వైభవం ,మనసుకు అందని ఆనందం లభిస్తాయి .ప్రమద గణాల లెక్క తేలనంత మంది ఉంటారు .సమస్త మంగళాల.కు ఆటపట్ట్టు భీమ క్షేత్రం .ఇక్కడ పురుగులు ,పక్షులు ,పాములు ,సాలెపురుగులు చనిపోయే ముందు భీమేశ్వర స్వామిని తలచుకొంటే ఎర్రనైన జటా జూటం  తో అందులో చంద్ర రేఖతో ,విశాలమైన నుదుట యెర్రని వేడికన్నులతో  తో శంఖం లాంటి కంఠం లో గరళ విషచ్చాయలను కాండ్రిం ఛి  ఉమ్మేస్తున్నట్లు   చెవి తమ్మేలకు పెద్ద పాములే చేవిపోగులుగా ఉన్న భీమేశ్వర దేవుడు దర్శన మిచ్చి మోక్ష ప్రాప్తి కల్గిస్తాడు .ఇందులో ఒక విశేషం కూడా ఉంది .మరణ సమయం లో ఎవరు భేమేశ్వరుని తలచినా వారికి ఆయన రూపం దర్శనమౌతుంది .సాలోక్య ,సారూప్య ,సామీప్య ,సాయుజ్య ములనే నాలుగు రకాల ముక్తి కలుగుతుంది .

‘’ఒక చోట గోటి పల్గ్యుడు రాజ కోటీర –విభ్రాజితోత్సంగ వృద్ధ గంగ

యొక చోట బీథాంబికోన్నతస్తన భరా –స్ఫాలజరిత కల్లోల ఏల

యొక చోట జటుల నక్ర కుళీర పాఠీన-తోయగర్భా భోగ తుల్య భాగ

యొక చోట నప్సరో నికర సంసేవితాం –తరము శ్రీ సప్త గోదావరంబు

నమరు ,నాగర ఖండ సిద్ధాంత జాతి –నాగవల్లీ సమాక్రాంత పూగ ఖండ

మండితోద్యాన వాటికా ఖండ విభవు –పాత్రమగు భీమ మండలీ క్షేత్రమునకు ‘’

భావం –గోరింట నారింజ చెరకు తోటలతో ,పవిత్ర సుందర జాజులతో ,తమలపాకుల తీగలు చుట్టుకొన్న పోక చెట్లతో అలంకారం గా ఉన్న తోటల చుట్టూ ఉన్న భీమ మండలం అన్నిటికంటే ఉత్క్రుస్తం గా విరాజిల్లుతోంది .దక్షిణ దిక్కున కోటి పల్లి క్షేత్రం లో సోమేశ్వరాలయం దగ్గరలో వృద్ధ గోదావరి ప్రవహిస్తూ ఉంది .ఉత్తరం లో పిఠాపురం లో పీఠికా దేవి మహోన్నత స్థాన భారాన్ని ఒరుసుకొని ప్రవహించే ఏలానదీ మహోత్తంగా తరంగాలు విరిగిపడుతాయి .పడమట తీవ్ర వేగం తో తిరిగే మొసళ్ళు , ఎండ్రకాయలు ,సొర చేపలు ,నీటిలో సమృద్ధిగా ఉన్న తుల్య భాగా నది ఉంది .తూర్పున స్నానం చేసే అప్సరసలతో నిండిన సప్తగోదావరి జల సమృద్ధి ఉంది .అంటే ఇక్కడ దేనికీ లోటు లేదు .అన్నీ సర్వ సమృద్ధిగా ఉన్నాయని హామీ ఇస్తున్నాడు అగస్త్యుడు వ్యాసుడికి .

గోదావరి ఎక్కడినుంచి బయల్దేరి ఎలా ప్రవహిస్తున్నదో ఇప్పుడు వివరిస్తున్నాడు .గోదావరి నది మహా రాస్స్ట్రలోని నాస్జిక్ కు దగ్గరలో ఉన్న త్రయంబక చల శిఖరాగ్రాన పుట్టి క్రమంగా పెరిగి ఆర్యావర్తం సమీపించింది .అక్కడి నుండి దండాకారణ్య మధ్య భాగం లోని పాపికొండలను ఆనుకొని ప్రవిహిస్తుంది .తరువాత పట్టిసీమ లేక పత్తిసీమ అన బడే చోట ఉన్న పర్వతం పై కొలువై ఉన్న శ్రీ వీర భద్ర స్వామిన పాదాలు తాకి సేవిస్తుంది .తరువాత ‘’తిల సోమ నాద స్వామి ‘’ఆలయాన్ని చుడుతుంది .పిమ్మట అనంత భోగేశ్వర స్వామి దేవాలయం చేరి విజ్రుమ్భిమ్చింది .అక్కడ నుండి రుద్రపాదాల దగ్గర ఒక మార్గం గుండా ప్రవహించి కోటి పల్లి శివ దేవుని మృదుపాదాలకు మొక్కుతుంది  .ఆ తర్వాత కుండ లా ముఖ క్షేత్రం లో శ్రీ కుమ్దలేశ్వరుని సేవిస్తుంది ,చివరకు భీమ ఖండం ప్రక్క గా ప్రవహించి సముద్రాన్ని కౌగలిం చుకొని లీన మవుతుంది .

ఇందులోని .విశేషాలను తెలుసుకొందాం .మహారాష్ట్రలోని నాసిక్ కు ముప్ఫై కిలో మీటర్ల దూరం లో త్రయంబక క్షేత్రం ఉంది .ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది .లింగా కారం గా ఉన్న ఆరు అంగుళాల గుంటలో బ్రహ్మ ,విష్ణు మహేశ్వరులు తో బాటు గోదావరి ఊటజలం ఉంటాయి . పైన కవచం ఉంటుంది .ఇక్కడే గౌతమ మహర్షి శివుని గూర్చి తపస్సు చేసిమేప్పిమ్చి గోదావరిని ఆవిర్భ వింప జేశాడు .మొదట ఈ నది బ్రహ్మ గిరిపై పుట్టి గుప్తం (అదృశ్యం )అయింది .తర్వాత గంగా ద్వారం అనే పర్వతం మీద జన్మించి అక్కడా కనిపించకుండా పోయింది .అంతకు ముందు మహర్షి కుశ లతో గోదావరి ప్రవాహాన్ని ఆపాడు .అదే’’ కుశావర్తం’’ అనే పేరుతొ పిలువ బడుతోంది .బ్రహ్మ శాపం వలన శివుడు పర్వతం అయ్యాడు .ఆ పర్వతానికి సద్యోజాతం ,వామ దేవం ,అఘోరం ,తత్పురుషం ,ఈశానం అనే పేర్లతో అయిదు శిఖరాలు ఉన్నాయి .ఈ పర్వతానికి త్ర్యంబకాచలం అనే పేరుంది .శివలింగానికి ఈ అయిదు రూపాలుంటాయి .

దండకారణ్యం ,సైమ్దవారణ్యం ,పుష్కరారణ్యం ,నైమిశారణ్యం ,కురుజామ్గలం ,ఉత్పలా వర్త కారణ్యం ,జంబూ మార్గం ,హిమ్వదరణ్యం ,అర్బుదారణ్యం అని మనకు తొమ్మిది రకాల  అరణ్యాలున్నాయి ,’’దండుది ‘’కద రామాయణం లో ఉంది. అధర్మ వర్తి అయిన దండుని శుక్రుడు శపించాడు .అతడు పాలించిన’’ మధు మంతం ‘’అనే రాజ్యం పై మట్టి వర్హాన్ని కురిపించటం చేత దండకారణ్యం ఏర్పడింది .ఇది మహారాష్ట్ర ఆంద్ర దేశాలలో ఉంది .

ప్రశ్రవణాచలం అంటే పాపికొండలు . భద్రాచలం  –రాజ మండ్రి మధ్య ఈ పర్వతం ఉంది .గోదావరి నదీ ప్రవాహం చేత ఈ కొండ పాపిడి దువ్వినట్లుగా చీలింది కనుక ‘’పాపిడి కొండ’’ అనే పేరొచ్చింది  అదే వాడుకలో పాపి కొండ అయింది .ఇక్కడ నది చాలా లోతు గా ,ప్రవాహ వేగం బాగా ఎక్కువ ,నది వైశాల్యం తగ్గి సన్నగా ఉంటుంది .

పట్టిసం –పశ్చిమ గోదావరిజిల్లా లో గోదావరి మధ్య దేవా కూట పర్వతం మీద ఉంది .శ్రీశైలం ,కాశి ,కేదారం ,శ్రీ కాళ హస్తి ,పట్టిస అనే అయిదిటిని ‘’పంచ కాశీ ‘’క్షేత్రాలంతారు .బ్రహ్మాండం లో పట్టిసకు సమాన మైన క్షేత్రం ,వీర భద్ర  స్వామి తో సమానమైన దేవుడు లేడు , ఉండడు , ఉండ బోడు అని పురాణం చెబుతోంది .పట్టిసం అంటే వెడల్పైన కత్తి .దక్ష యజ్న విధ్వంసం లో వీరభద్రుడు దేవతలను ఈ ఆయుధం తో నరికిపారేసి దాన్ని ఇక్కడి గోదావరి నీటిలోకడిగి  ఈ పర్వతం పైకి చేరాడు .అందుకే పట్టిస అనే పేరొచ్చింది .

పట్టిసకు పదికిలో మీటర్ల దూరం లో తాళ్ళపూడిలో ఉన్న శివుడినే తిలసోమ నాధుడు అంటారు .ఇక్కడి గోదావరి తీర్దానికి తిల తీర్ధమనిపేరు .ఈ ఆలయానికి దిగువన అయిదు కిలోమీటర్ల దూరం లో గోదావరిఒడ్డున అనంత సోమేశ్వర స్వామి ఆలయం ఉంది .ఇది గోదావరిలో పడిపోతే దగ్గరలో కుమార దేవం లో స్వామిని ప్రతిస్టించారు  .

.రాజ మండ్రి  రైలు వంతెనకు ఉత్తర ,దక్షినణాలలో పాదాలుగా ఉండే రాయి ఉన్న చోటును రుద్రపాదాలంటారు.. ఇవే రాజమండ్రిలోని పుష్పగిరి పాదాలు .రుద్రపాదాలనుంది గోదావరి తీరం లో నలభై కిలో మీటర్ల దూరం లో కోటి పల్లి ఉంది .సోమేశ్వరస్వామి ఉన్నాడు .రజత కిరీటాన్ని ఎప్పుడూ ధరిస్తాడు కోటి లింగేశ్వర స్వామి. అదీప్రత్యేకత .ఈయన్ను అర్దెందు ధరుడు అంటారు .కోటిపల్లికి ముప్ఫై అయిడుకిలో మీటర్ల దూరం లో వృద్ధ గౌతమి ఒడ్డున కుండలా ముఖం అనే క్షేత్రం ఉంది ;శివలింగం చివర మకర కుండలా కారం గా ఉండటం వలన ఆపేరోచ్చింది .స్వామి కుండలేశ్వరుడు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-11-14-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

‘’

‘’

 

 

 

 

 

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.