శ్రీనాధుని భీమ ఖండ కధనం -2 ప్రధమాశ్వాసం

శ్రీనాధుని భీమ ఖండ కధనం -2

ప్రధమాశ్వాసం

శ్రీనాధుడు ప్రధమాశ్వాసం లో ముందుగా ఉత్పలమాలలో ద్రాక్షారామ భీమేశ్వరుని స్తుతించి ఆయన అన్నయ మంత్రికి సకల శుభాలు కలిగించికాపాడాలని కోరాడు .

‘’శ్రీ స్తన గంధ సార పరి పేష సమంచిత సాయక ప్రయో –గాస్తమహా పురత్రాయు దాహార్య ధనుర్ధరుడర్క కోటి దీ

ప్తి స్తవనీయ విగ్రహుడు భీమయ దేవుడు దక్ష వాటికా –వాస్తుడు ప్రోచు గావుత ధ్రువంబుగ దేవయ యన్న దీమణిన్ ‘’

అర్ధం –శ్రీలక్ష్మీ దేవి పాలిండ్లపై ఉన్న గంధపు పూతను హత్తుకొన్న వక్షస్థలం కల శ్రీమహా విష్ణువు ను బాణం గా చేసి ,మేరు పర్వతాన్ని ధనుస్సుగా ,త్రిపురాలను దహించిన వాడు ,కోటి సూర్య ప్రభలతో దివ్యమైన విగ్రహుడు ,దాక్షారామ నివాసి అయిన శ్రీ భీమేశ్వర స్వామి ,కృతిపతి అయిన దేవయమంత్రి కుమారుడు అన్నయ మంత్రిని రక్షించుగాక .కావ్యాన్ని శ్రీ కారం తో మొదలు పెట్టటం ఒక ఆచారం .దాన్నే కవి పాటించాడు . ఈ గ్రంధం లో నాలుగవ ఆశ్వాసం లో త్రిపురాసుర వధ ఉంది .అంటే గ్రంధ విషయాన్నికూడా చెప్పకనే చెప్పాడన్నమాట .శ్రీనాధుడి నోరు, చెయ్యి ఎప్పుడు ‘’స్తనం ‘’మీద ఉంటుంది అనటానికి మరో ప్రత్యక్ష నిదర్శనం కూడా .

తరువాత ఇష్ట దేవతా ప్రార్ధన చేశాడు .విఘ్న నివారకుడైన వినాయకుడిని స్తుతించాడు .ఏనుగు ముఖం తో ఎలుక వాహనం పై దేవ సేనాని అయిన కుమారస్వామికి అన్న ఐన వినాయకస్వామి తాతాకుల్లాంటి చెవులను విసురుతుంటే ,వచ్చే పెనుగాలికి విఘ్నాల సమూహాలనే మేఘాలు చెల్లా చెదురై పార ద్రోలాలని కోరాడు .పిమ్మట రాదామాధవులను సంస్తుతించాడు .ఇలా ఇంతవరకు ఏకవీ చేయలేదని శ్రీనాదుడే దీనికి నాన్దిపలికాడని ముందే చెప్పుకొన్నాం .ఆపద్య వైభవం చూద్దాం –

‘’వాలిక మోము మత్తవన బర్హి కిషోర లాస్య లీల బై –వాలిచి ,పచ్చకప్పురపు వాసన తోడి ముఖార వింద తాం

బూలపు మోవి ,మోవిపాయి మోపుచు రాధకు నిచ్చు ధూర్త గో—పాలుడు ప్రోచుగావుట మాపార కృపామతి మంత్రి యన్నయన్ ‘’

భావం –మదించిన అడవి నెమలి పిల్ల లాస్య నిన్యాసాన్ని అనుకరిస్తూ ,తన కోల ముఖాన్ని  రాధ ముఖం పై ఆనించి ,పచ్చ కర్పూరం దట్టించిన తాంబూలం తో తన పెదవిని ముద్దు కోసం రాధకు ఇచ్చే కొంటె కృష్ణుడు ,అపారమైన దయతో అన్నయ మంత్రిని రక్షించుగాక .ఈ విధం గా తెలుగు సాహిత్యం లో రాధాకృష్ణుల ప్రేమను మొట్ట ప్రవేశ పెట్టిన ఘనత పొందాడు శ్రీనాధుడు .

వెంటనే సరస్వతీ స్తవం చేశాడు .’’బ్రహ్మ దేవుని పట్టపు రాణి ,హంస వాహన ,బంగారు వీణను వాయించు రమణీ మణి ,పద్నాలుగు విద్యలకు ఆలవాలమైంది ,పద్నాలుగు లోకాలను పరిపాలించేడి మహా రాజ్ఞి ,చంద్ర రేఖను సిగ పూవుగా దాల్చిన సుందరి ,తెల్లని చిన్నారి రామ చిలుకను ఇష్ట సఖిగా కలిగినది ,ఓంకారం అనే పీఠం పై నివసించేపద్మ గంధి ,దేవకాంతల మ్రొక్కులు అందుకొనే సరస్వతీ దేవి –పాల  సముద్రం యొక్క అలలను సైతం పీడింపగల సాహిత్య సౌహిత్య లక్ష్మిని మాకు అనుగ్రహించుగాక ‘’.

ఈ విధం గా ముఖ్య దేవతలను స్తుతించి కవి తనకు పూర్వం ఉన్న కవీన్ద్రులను సంస్మరించాడు .ముందు వాల్మీకిని శ్లాఘించాడు –

‘’శ్లోకంబుల్ శతకోటి  గాండములుగా సూత్రించి రామాయణం –బేకాక్షర మెల్ల పాపముల మాయింపంగ నిర్మించి ,సు

శ్లోకుం డైన పురాణ సంయమి వరున్ జూతున్మనో వీధి ,వా-ల్మీకిన్ బ్రహ్మ పదావ తీర్ధ కవితా లీలావతీ వల్లభున్ ‘’

‘’అసం ఖ్యకాలైన  శ్లోకాలను  కాండాలుగా కూర్చి ,ప్రతి అక్షరం పాపాలను  హరిం చేట్లుగా రామాయణ మహా కావ్యాన్ని రచించి మంచి కీర్తి పొందిన వాడు ,ప్రాచీన మహర్షి సత్తముడు ,బ్రహ్మ దేవుని అనుగ్రహం తో కవితా విలాసినికి ప్రియ పతియైన వాల్మీకి ని నా మనసులో తలుస్తాను ‘’.తరువాత వ్యాస మహర్షినీఘనం గా ప్రస్తుతించాడు

‘’తలతున్ భారత సంహితాధ్యయన విద్యా నిర్మిత ప్రక్రియా –నలిన ప్రోద్భ వునిన్ ,గళింగ తనయాం తర్వేది ,పుణ్య స్థలీ

పులినాభోగా క్రుతావ తారు ,నపరాంభోజాక్షు  ,నక్షీణ ,ని –ర్మల సాహిత్య కళా  సమృద్ధికయి పారాశర్య మౌనీశ్వరున్ ‘’అంటే ‘’పంచమ వేదమైన భారత రచనా ప్రక్రియకు సృష్టికర్త అయిన బ్రహ్మ వంటి వాడు ,యమునా నది మధ్య ద్వీపం లోని పవిత్ర ఇసుక స్థలి పై జన్మించిన వాడు ,విష్ణు స్వరూపుడు ,పరాశర మహర్షి కుమారుడు అయిన వ్యాస మహర్షిని అనంతమైన సాహితీ కళా సమృద్ధి కోసం ధ్యానిస్తాను ‘’

ఇప్పుడు కాళిదాసాది కవుల ప్రతిభా విశేషాలను కొనియాడాడు –రసభావాలను పోషించటం లో మహనీయ కవితా విలాసుడు కాళిదాసుని,నిర్దుష్టమైన గద్యం తో ఈశ్వరునినే మెప్పించిన బాణ భట్టును ,సాహిత్యం అనే మహా సామ్రాజ్య సింహాసనాన్ని అస్దిస్తించిన ప్రవర సేనుడిని ,సముద్ర తరంగాల్లాగా గంభీర ,సారవంతాలైన పలుకులగొప్పతనం ఉన్న శ్రీ హర్షుని ,భాణుడు శివ భద్రుడు ,సౌమిల్లుడు ,భాల్లుడు ,మాఘుడు ,భారవి ,బిల్హనుడు ,మల్హనుడు ,భట్టి ,చిత్తపకవి ,దండి కవులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ‘’

ఇందులో ప్రవర సేనుడు పద్నాలుగో శతాబ్దం కవి .మహా రాష్ట్ర ప్రాకృతం లో ‘’సేతు బంధం ‘’పద్య కావ్యం రాశాడు .శివ భద్రుడు ఏమి రాశాడో తెలియటం లేదు. సౌమిల్లుడు ‘’శూద్రక మహా రాజు ‘’కధను రాసినట్లు బిల్హనుడు చెప్పాడు .ఇతని సోదరుడు రోమిల్లుడు .భల్లుడు కాశ్మీర కవి భల్లాట శతక కర్త. క్రీ శ ఎనిమిది వందల ఎనభై మూడు నుండి తొమ్మిది వందల రెండు వరకు ఉన్నాడు .భిల్హనుడు విక్రమాంక చరిత్ర రాశాడు మల్హనుడిగురించి తెలియ రాలేదు .చిత్తపకవి ‘’శివ స్తుతి ‘’రాశాడు.

శ్రీనాధుడు తర్వాత నన్నయ ,తిక్కనను ,తన తాత కమల నాభుడిని  కీర్తించాడు .సుకవులను స్తుతించి కుకవులను ఈ కావ్యం లోనే మొదటి సారిగా నిందించాడు  .కాకి మూక చుట్టూ చేరి చెవులు పగిలేట్లు నిరంతరం గా గోల చేసినంత మాత్రాన రాజహంస ఏమీ మాట్లాడకుండా ఉంటుంది .సహించలేని స్తితి వస్తే అదే ఇంకో చోటుకు పోవటం ఉత్తమం అన్నాడు రాజ మహేన్ద్రవరం లో అసూయాగ్రస్తులైన కవులు తనను పెట్టిన ఇబ్బందులను తలచుకొంటూ ఇలా చెప్పిఉంటాడు .

చివరికి తన భాష గురించిఒక పద్యం లో వివరించాడు

‘’ప్రౌఢి బరి కింప సంస్కృత భాష యండ్రు –పలుకు నుడికారమున నాంధ్ర భాష యందు

రేవ్వరేమన్న నండ్రు గాకేల కొరత –నా కవిత్వంబు నిజాము కర్నాట భాష ‘’

‘’దీర్ఘ సమాసాలతో ప్రౌఢం గా నేను రాస్తే సంస్కృత భాష అన్నారు .సొగసులతో నుడికారం తో పలుకుబడులతో రాస్తే స్వచ్చమైన తెలుగుభాష అన్నారు .ఎవరికి ఎలా అని పించినా నేకేమి లోటు ?నిజం గా నా కవిత్వం కర్నాట భాష ‘’అని అసందిగ్ధం గా చెప్పుకొన్నాడు .కర్నాటక అంటే చెవులకు ఇంపు అయినది నది –కర్ణే –అటతి-ఇతి –కర్ణాటః.శాత వాహన రాజులలో శాతకర్ణి ,సుందర శాతకర్ణి మొదలైన వారున్నారు వీరికి కర్ణి రాజులని కూడా పేరుంది. కర్నిరాజులు పాలించిన దేశం కనుక కర్ణి నాడు ,కర్నాడు అయి కర్ణాటం అయిందనిమల్లంపల్లి సోమ శేఖర శర్మ గారు అభిప్రాయ పడ్డారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-14-ఉయ్యూరు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.