శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -2 త్రికూట రహస్యం

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -2

త్రికూట రహస్యం-2

శరీరపు మూడుకూటాలను కలిపి ‘’కుల ‘’అంటారు .ప్రాణి శరీర తత్వ సారం అంతా ఈ మూడుకూటాలలో ఉంటుంది .పాదాల నుండి శిరస్సు దాకా ఉన్న శరీరమంతా ‘’కుల ‘’అనవచ్చు .కంఠానికి పైభాగం సర్వ శ్రేష్టం అనిలోక రివాజు .లలటానికి పైనా  ,కపాలానికి కింద శ్రీ లలితా పరమేశ్వరి సహస్ర దళ కమలం లో నివసిస్తుందని విజ్ఞులంటారు .ఇక్కడ అఖండ ఆనందామృతం నిరంతరం స్రవి స్తుంది  .ఈ ఆనందామృతాన్నే ‘’కులామృతం ‘’అన్నారు .ఇదే నశించే శరీరానికి అమరత్వ సిద్ధికలిగిస్తుంది .దీనినే ‘’రసం ‘’అనీ అంటారు .రసమే పరమాత్మ స్వరూపం .దేవి రసమయి .సాధకుడు ‘’రసయిత ‘’.రసమయి ,రసయిత మధ్య సంధానం చేసే శరీరం ‘’కుల ‘’ను చూడటానికి ఒక్క లిప్త పాటు పరీక్షించి నిగ్గు తేలిస్తే  అమృత భాండారం  అవుతుంది అన్నారు ఇలపావులూరి వారు .శరీరం  భస్మ మైన తర్వాత కూడా శరీరం లోని ఈ అమృతత్వం అనంత కాంతిపుంజం లో తన చిత్ ప్రకాశాన్ని వ్యాపింప జేస్తుంది .ఈ అమరత్వం ,ఆనంద తత్త్వం పరమేశ్వరి కృప వల్లనే ఆస్వాదించగలం ..దేవి తానూ కులామృతాన్ని ఆస్వాదిస్తుంది ,ఇతరులనూ ఆస్వాదింప జేస్తుంది .అసలు రసమే ఆమేకదా .రసయితా ఆమే.ఆమె ధ్యానం ధ్యాయిత్వం ధ్యాత కూడా .మాతా ,మేయ ,మాన రూపాల మూడిటి సమ్మేళనమే దేవి .ప్రపంచాన్నికొలిచే కోలా బద్దకూడా  ఆమెయే .సమస్త ప్రపంచం ఆమె వైభవాన్ని కొలిచే ప్రయత్నం చేస్తుంది .కొలిచే వారి కొలత సాధనమూ ఆమే కదా .

అన్నికులాలను దేవి  సృష్టించింది కనుక సృష్టి మంచి చెడు బాధ్యతా ఆమెదే .దీనిని సూచించేదే ‘’కుల సంకేత పాలిని ‘’అనే నామం .ప్రాణుల జగత్ అంతా కులమే .దాని ఆలనా పాలనా ప్రణదాత్రి అయిన పరమేశ్వరిదే .ప్రేమతో ఈ  కార్యం నెర వేరుస్తుంది .ప్రాణి శరీరం లో ప్రాణ శక్తి రూపం లో ఆమె సంచరిస్తుందని మనం చెప్పుకొన్నాం .మూలాధారం నుండి సహస్రారం వరకు విభిన్న కేంద్రాలలో దేవి భిన్న రూపాలు చూడగలం .ఒక చోట సాకినిగా ,మరొక చోట కాకిని గా ,వేరే చోట హాకినిగా ,ఇంకొక చోట సర్వాంతర్యామిని అయిన యాకిని గా ఆమె మూలాధార ,స్వాదిస్టాన ,మణిపూరక ,,అనాహత ,విశుద్ధి ,ఆజ్ఞాది చక్రాలలో ఉంటుంది .ఇవి బయటికి కనిపించేవికావు .సంకేత స్థలాలు మాత్రమె .ఇక్కడే సర్వ మంగళ సాక్షాత్కారిస్తున్దంటారు పాండురంగా రావు గారు .అంటే దేవి కులాలనే కాదు కుల సంకేతాలనూ పాలిస్తుంది అని తెలుసుకోవాలి  తాను  ఏర్పరచిన నియమాలనూ ,సంకేతాలను ,ఆదర్శాలను ఆమె ఆచరిస్తుంది ,సాధకుల చేత ఆచరింప జేస్తుంది .ఇదంతా ఒక ప్రత్యేకమైన కూటభాష .అంటే సంకేత భాష .పరమేశ్వరి కూటత్రయ భాషా కళేబర రహస్యం తెలిసిన వారే దీన్ని అర్ధం చేసుకోగలరు .దీని తాళం చెవి వారి దగ్గరే ఉంటుంది .

ఈ కూట భాష ద్వారా కల భాషిణి కల్యాణిని చేరుకోవటానికి  రెండు ఉత్తమ  మార్గాలున్నాయి .ఒకటి కౌల మార్గం రెండవది సమయ మార్గం .కౌలమార్గం కులం లో ఉంటూనే కులాంగన సహ యోగం తో కైవల్యాన్నిపొందేకర్మ యోగం .సమయ లేక సమయాచార మార్గం లో ధ్యాన జ్ఞానాల ద్వారా సమయం తో సహస్ర దళ కమలంలో నివసించే సరసిజ నయన అయిన దేవీ సాక్షాత్కారం సాధించే సాదుమార్గం .కౌలమార్గాన్ని వామాచారం అనీ అంటారు .సమయాచారాన్ని దక్షిణా చారం అంటారు .కౌలం లో కామ వాసన పోదు .మానిని ,మాంసం ,మద్యం ,ముద్ర మొదలైన పంచ మకారాల అనుభవమూ ఉంటుంది .కానీ ఈ మార్గం లో బాలన్స్ చాలా ఉండాలి .లేక పొతే  అధో పతనమే .సమయాచారం ఆచరణకు సులభం ,సాదుమార్గం కూడా .గృహస్త జీవితం గడుపుతూ ,కామ భోగం అనుభవిస్తూ ,పరమేశ్వరి సాన్నిధ్యాన్ని పొందే మార్గం ఇది .నిజానికి ప్రతి స్త్రీ పరమేశ్వరి ప్రతిరూపమే కదా .సవ్య దృష్టిలో స్త్రీని అర్ధం చెసుకుంటే దివ్యత్వం గోచరిస్తుంది .బాహ్యానికే కట్టుబడితే దారి మూసుకు పోతుంది .

సమయాచారం లో లౌకిక వాసనలకు స్థానం ఉండదు .యమ ,నియమ ,సమయ ,ప్రాణాయామ ,ప్రత్యాహార ,ధారణ ,సమాధి మొదలైన ఉత్తమ సాధనాలతో ముందుకు నడవాలి .శివ ,శక్తుల సామరస్యమే ఈ సాధనకు సారం అన్నారు డాక్టర్ గారు .శివసాయుజ్యమే సాధకుని లక్ష్యం .సాధకుడు –సాధ్యం ,ఆరాధకుడు –ఆరాధ్యం ,జీవుడు –బ్రహ్మ ,ప్రకృతి –పురుషుడు ,తత్ –త్వం లు ఏకం కావటమే సమయాచార సంవిద అంటే మార్గం .సంవిదకే మరోపేరు సమయం ..సమయాన్ని ఆచరణ లోకి తేవటమే సమయాచారకుడి సాధనా రహస్యం .సంవిత్ –కామేశ్వరుడు .సంవిద –కామేశ్వరి .కామేశ్వరీ కామేశ్వరుల సాయుజ్యాన్ని సాక్షాత్కారించుకోవటం కోసమే కౌల ,సమయాచార మార్గాలేర్పడ్డాయి .సాధకుడి యోగ్యతా ,ఆసక్తిని బట్టి  కావలసిన మార్గాన్ని ఎన్నుకోవాలి .పరమేశ్వరి దృష్టిలో రెండూ సమానమైనవే .ఈ సమదృష్టిని తరువాత నామం లో చెప్పారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-14-ఉయ్యూరు

 

 

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.