Category Archives: జ్ఞానదుడు మహర్షి నారదుడు -1

జ్ఞానదుడు మహర్షి నారదుడు -1

            జ్ఞానదుడు మహర్షి నారదుడు -1

దేవ ,దానవ మానవులలో అజ్ఞానం ప్రబలి ,అహంకార బలగార్వాలతో మెలగి ప్రజలను ,లోకాలను పీడించి ,హాని కల్గ జేసేసమయం లో వారి అజ్నానాంధ కారాన్ని పోగొట్టి ,జ్ఞాన జ్యోతిస్సును వెలిగించి గర్వం ఖర్వం చేసి ,లోకోపకారం చేసే మహర్షి పుంగవుల వల్లనే ఈ విశ్వానికి శుభం శ్రేయస్సులు కలుగుతున్నాయి .తను ఒక మహర్షియై ,సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రుడై భక్తీ విధానానికి ఆచరణ లో ఆదర్శమూర్తియై ,నవవిధ భక్తీ మార్గాలను ఉపదేశించి ,తాను తరించి ,లోకాలను తరింప జేసేన మహోపకారి నారద మహర్షి .’’నారం దదాతీతి నారదః ‘’అని –అంటే జ్ఞానాన్నిచ్చే వాడే నారదుడు అని అర్ధం చెప్పారు .అంతే కాదు –నీటి నుండి జన్మించిన వాడు అని కూడా అర్ధం .గాన విద్య లో మేటి నారదుడు .నిరంతర హరి స్మరణ పారాయణుడు .శ్రీ హరి భక్తిని సకల లోక వ్యాప్తి చేసిన పరమ భాగవతోత్తముడు .లోకోపకారం కోసం ఎన్నో నిందలు భరించినా , చలించని ఆత్మ స్థైర్యం తో తన మార్గాన్ని విడువని వాడు .మంచికి పోతే చెడు ఎదురైనట్లు –లోకోపకారం కోసం ఆయన పడిన పాట్లకు ‘’కలహా భోజనుడు ‘’గా లోకం చేత ముద్ర వేయిం చుకోన్నవాడు .’’నారాయణ –నారాయణ ‘’అంటూ ,తాను పొందిన పరాభవాన్ని కూడా దిగమింగుకొంటు ,నింద అనే హాలాహలాన్ని అమృతం గా ఆరగించిన అపర బోళా శంకరుడు నారద ముని  .దేవర్షి గా కీర్తింప బడ్డవాడు  .అలాంటి పరమోత్తమ మహర్షి జ్ఞానదుడు అయిన మహర్షి  నారదునిజీవిత సంగ్రహం తెలుసుకోవటం రమణీయం ,.అందుకే వారి చిద్విలాసాలు ,ఏ సందర్భం లో ఎలా ఉన్నాయో వివరించటం ,భక్తీకి  పరాకాష్ట అయిన ఆంద్ర మహా భాగవతోత్తములలో భక్త పోతన ,తీర్చి దిద్దిన నారద మహర్షిని ,మీ ముందుంచటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం .

                    జనన వృత్తాంతం

       బ్రహ్మ వైవర్త పురాణం లో నారదుడు విష్ణు మూర్తి కంఠం నుంచి  జన్మించి నట్లు ఉన్నది .విష్ణు మూర్తి యేనారదుడు అనే దేవర్షి యై ,కర్మ నిర్మోచనం చేసే వైష్ణవ తంత్రాన్ని బోధించినట్లు భాగవతం చెబుతోంది .బ్రహ్మ తొడ నుండి నారదుడు జన్మించి నట్లు భాగవత కధనం .

        దక్షప్రజాపతి ‘’ప్రియ ‘’అనే తన పుత్రికను బ్రహ్మ దేవుడికి ఇస్తే ,ఆమె యందు నారదుడు జన్మించి నట్లు బ్రహ్మ వైవర్త పురాణం లో ఉంది .పూర్వ మహా కల్పం లో ‘’ఉప బర్హణుడు ‘’అనే గంధర్వుడే నారదుడు .బ్రాహ్మలు దేవ సత్రం అనే యాగం చేస్తూ శ్రీమన్నారాయణుని కధలను గానం చేయటానికి అప్సరసలను ,గంధర్వులను పిలిపించారు .ఉప బర్హనుడు కూడా వెళ్లి గంధర్వులతో కలిసి పాడుకొంటూ ఉండటం తో విశ్వ స్రస్టలు’’శూద్ర యోని ‘’లో జన్మించ మని శాపం ఇచ్చారు ఆ శాపం వల్ల ఒక బ్రాహ్మణుని ఇంట దాసీ కడుపున పుత్రుడి గా జన్మించి నట్లు భాగవత పురాణ కధనం .చాతుర్మాస్య దీక్షలో ఉన్న మునులకు  పరి చర్య చేస్తూ ఉండేవాడు .వారిని అనుసరించటం వల్ల  గొప్ప జ్ఞానం కలిగింది .అతని తల్లి పాలు పితుకుతు పాము కరిచి చని పోయింది .ఇలా సంసార బంధ విముక్తుడైనాడు .ఆ సంతోషం తో ఉత్తరాభిముఖం గా వెళ్లి మహారణ్యం లో ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు .ఈశ్వరుని రూపు ఎలా ఉంటుందో మనసులో నిలుపుకోలేక పోయాడు .అప్పుడతనికి’’ ఈశ్వర వాక్యం ‘’వినిపించింది .’’ముని ముఖ్యులు చూసే మా రూపాన్ని నువ్వు చూడ లేవు .ఈ సృష్టి లయం చెందినపుడు నీ శరీరం నశించి ,మళ్ళీ జన్మించి ,నా అనుగ్రహం తో నా రూపాన్ని దర్శిస్తావు ‘’అలానే ప్రళయం వచ్చింది నారద జన్మలయం చెంది ,శ్రీహరి దయతో శుద్ధ సత్వమైన దేహం లో ప్రవేశించాడు .నారాయణ మూర్తిలో నిద్ర పోవాలని నిశ్చయించి ,బ్రహ్మ విశ్వాసము వెంబడి అతని లో ప్రవేశించి బ్రహ్మ ప్రాణం వల్ల మరీచి మొదలైన ముఖ్యులతో జన్మించి నట్లు భాగవత పురాణ గాధ తెలియ జేస్తోంది

              సశేషం

                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-3-13 ఉయ్యూరు 

 

ప్రకటనలు