దర్శనీయ శివాలయాలు గుంటూరు జిల్లా 22- శిబిచక్రవర్తి లింగాకృతిపొందిన- శ్రీ కపోతేశ్వర దేవాలయం –చేజెర్ల

దర్శనీయ శివాలయాలు

గుంటూరు జిల్లా

22-  శిబిచక్రవర్తి  లింగాకృతిపొందిన- శ్రీ కపోతేశ్వర దేవాలయం –చేజెర్ల

గుంటూరు జిల్లా నకరి కల్లు మండలం లో నరసరావు పేటకు 30కి.మీ దూరం కో ఉన్న చేజర్ల గ్రామం లో పురాతన శ్రీ కపోతేశ్వరాలయం ఉంది .దాన శీలం లో ప్రసిద్ధు డైన శిబి చక్రవర్తి ఇక్కడ లింగ రూపం లో వెలసిన పవిత్ర క్షేత్రం .కాశ్మీరప్రభువైన శిబి చక్రవర్తి  పెద్ద తమ్ముడు ‘’మేఘాడంబురుడు’’,రెండవ తమ్ముడు ‘’జీమూత వాహనుడు ‘’తీర్ధ యాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి ,ఇక్కడి పర్వత గుహలో తపస్సు చేస్తూ దేహాలు చాలించి లింగాకారు లైవెలిశారు .ఈ విషయం తెలిసిన శిబి తానూ కూడా సోదరులలాగే ముక్తి పొందాలని చేజెర్ల చేరాడు .ఇక్కడ నూరు యాగాలు చేశాసు  .శిబి దానశీలతను పరీక్షించాలని దేవతలు భావించిబ్రహ్మ ,శివుడు  పావురం ,కిరాత రూపాలుధరించి శిబిని చేరారు .కిరాత బాణానికి కాలికి దెబ్బతగిలిన కపోతం శిబిని చేరి శరణు కోరింది  .అభయమిచ్చాడు శిబి చక్ర వర్తి .ఇంతలో కిరాతుడు వచ్చి తాను  వేటాడిన పావురం తనదే నని దాన్ని తనకివ్వాలని పేచీపెట్టాడు .శరణు కోరిందాన్ని ఇవ్వలేనని పావురం బరువుతో సమానమైన తన శరీర మాంసాన్ని దానికి బదులుగాకోసి ఇస్తానన్నాడు శిబి .సరేనన్నాడు కిరాతుడు .ఒక త్రాసు తెప్పించి ఒక వైపు పావురాన్ని పెట్టి ,మరో వైపు తన శరీరం నుండి కోసిన మాంస ఖండాలను పెట్టి తూచాడు .యెంత మాంసమైనా పావురం బరువుకు సరి తూగలేదు .ఇదేదో దైవ మాయ అనిపించింది .చివరికి తన తల నరికి త్రాసు లో పెట్ట బోయాడు .అప్పుడు శివ ,బ్రాహ్మలు త్యక్షమై అతడ్ని పరీక్షించ టానికి చేసిన ప్రయత్నం ఇది అని వివరించి శిబి దాన శీలతకు మెచ్చి వరం కోరుకొమ్మన్నారు .తాను  శివలింగాకృతి దాల్చే యోగం ప్రసాది౦చ మన్నాడు శిభి .సరేనన్నారు. కపోతాన్ని రక్షించి శివుని మెప్పించి లింగాకృతి దాల్చిన శివుడుక పోతేశ్వరుడైనాడు .దీనికి దాఖలాలుగా  లింగం పైకత్తి గాట్లు  కనిపిస్తాయి . .శిబి దేహం నుండి తీసిన మాంసానికి ఇవి ఆనవాళ్ళు .లింగం పైభాగాన రెండువైపులా రెండు బిలాలు కనిపిస్తాయి .కుడి రంధ్రం లో ఒక బిందెడు నీరు పడుతుంది .ఎడమ వైపు బిలం లో యెంత నీరు పోసినా నిండక పోవటం ఆశ్చర్య మేస్తుంది .అభిషేక జాలం ఇందులోనుండి ఎక్కడికో ప్రవహించి వెళ్ళిపోతుంది ,ఇక్కడి నందీశ్వరుడు కపోతేశ్వరలి౦గా న్ని కుడి కంటితో వీక్షిస్తున్నట్లు   ఉండటం సాధారణానికి భిన్నంగా ఉంటుంది .ఇదొక వింత .

గ్రామానికి వాయవ్యం లో కపోతేశ్వరాలయం తూర్పు ముఖం గా  ఉంది .ఆలయం చతుర్భుజాకారం తో విశాలమైన ఆవరణ లో ఉంది .ఆవరణ చుట్టూ రెండు ప్రాకారాలున్నాయి .అన్ని దిశల్లో దేవతామూర్తులకు చిన్న చిన్న మందిరాలున్నాయి .9అడుగుల ఎత్తున ఉన్న సహస్ర లింగాకార మూర్తి విశేషం  ఆకర్షణ  ,నైరుతిలో సప్త మాత్రుకల దేవాలయం ఉంది. మల్లికా పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేస్తారు .ప్రవేశ గోపురానికి ఎదురుగా చిన్నమండపం ధ్వజ స్థంభం ఉన్నాయి .రెండు రాతి పలకలపై ఒక్కొక్కదానిమీద వెయ్యేసి లింగాలు ఉండటం మరో ప్రత్యేకత .పాలరాతి ఫలకం పై పద్మ హస్తుడైన సూర్య భగవానుడు దర్శన మిస్తాడు .గర్భ గృహానికి రెండు వైపులా,మూడేసి రాతి స్తంభాలపై రాతి దూలాల కప్పు ఉంది. చదరపు వేదికపైన ఉన్న కపోతేశ్వర లింగం తలలేని శిబి చక్రవర్తి శరీరాకృతి గా అనిపిస్తుంది

శ్రీ కృష్ణ దేవరాయలు రెండు శిలా శాసనాలు ఇక్కడ వేయించాడు .రాయలు కొండవీడును జయించి వచ్చి స్వామికి 360 ఎకరాలభూమిని దానం ఇచ్చిన శాసనం ఉంది .మంత్రులు   తిమ్మరుసు,కొండ మరుసయ్య పేర్లమీద తిమ్మ సముద్రం ,కొండసముద్రం అనే రెండు చెరువులున్నాయి .నిత్యార్చనలు విశేషార్చనలు జరుగుతూనే ఉంటాయి .దసరా కార్తీక మాసాలలో ఏకాదశీ పర్వ దినాలలో శివరాత్రికి సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జ్వాలా తోరణాలతో ఆలయం శోభాయమానం గా ఉంటుంది .స్వామి వారల ఊరేగింపు ఉంటుంది .

ఆలయం గజ పృష్ట ఆకారం(ఏనుగు వెనుక భాగం ) లో ఉండటంఒక ప్రత్యేకత .విమానం పావురం గూడు ఆకారం లో ఉండటం మరో విశేషం . కపోతేశ్వరునిపై పొన్నూరు సంస్క్రుతకళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రీ గారు ‘’కపోతేశ్వర శతకం ‘’రాశారు

.      .Inline image 1       Image

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.