శ్రీనాధుని భీమ ఖండ కధనం -2 ప్రధమాశ్వాసం

శ్రీనాధుని భీమ ఖండ కధనం -2

ప్రధమాశ్వాసం

శ్రీనాధుడు ప్రధమాశ్వాసం లో ముందుగా ఉత్పలమాలలో ద్రాక్షారామ భీమేశ్వరుని స్తుతించి ఆయన అన్నయ మంత్రికి సకల శుభాలు కలిగించికాపాడాలని కోరాడు .

‘’శ్రీ స్తన గంధ సార పరి పేష సమంచిత సాయక ప్రయో –గాస్తమహా పురత్రాయు దాహార్య ధనుర్ధరుడర్క కోటి దీ

ప్తి స్తవనీయ విగ్రహుడు భీమయ దేవుడు దక్ష వాటికా –వాస్తుడు ప్రోచు గావుత ధ్రువంబుగ దేవయ యన్న దీమణిన్ ‘’

అర్ధం –శ్రీలక్ష్మీ దేవి పాలిండ్లపై ఉన్న గంధపు పూతను హత్తుకొన్న వక్షస్థలం కల శ్రీమహా విష్ణువు ను బాణం గా చేసి ,మేరు పర్వతాన్ని ధనుస్సుగా ,త్రిపురాలను దహించిన వాడు ,కోటి సూర్య ప్రభలతో దివ్యమైన విగ్రహుడు ,దాక్షారామ నివాసి అయిన శ్రీ భీమేశ్వర స్వామి ,కృతిపతి అయిన దేవయమంత్రి కుమారుడు అన్నయ మంత్రిని రక్షించుగాక .కావ్యాన్ని శ్రీ కారం తో మొదలు పెట్టటం ఒక ఆచారం .దాన్నే కవి పాటించాడు . ఈ గ్రంధం లో నాలుగవ ఆశ్వాసం లో త్రిపురాసుర వధ ఉంది .అంటే గ్రంధ విషయాన్నికూడా చెప్పకనే చెప్పాడన్నమాట .శ్రీనాధుడి నోరు, చెయ్యి ఎప్పుడు ‘’స్తనం ‘’మీద ఉంటుంది అనటానికి మరో ప్రత్యక్ష నిదర్శనం కూడా .

తరువాత ఇష్ట దేవతా ప్రార్ధన చేశాడు .విఘ్న నివారకుడైన వినాయకుడిని స్తుతించాడు .ఏనుగు ముఖం తో ఎలుక వాహనం పై దేవ సేనాని అయిన కుమారస్వామికి అన్న ఐన వినాయకస్వామి తాతాకుల్లాంటి చెవులను విసురుతుంటే ,వచ్చే పెనుగాలికి విఘ్నాల సమూహాలనే మేఘాలు చెల్లా చెదురై పార ద్రోలాలని కోరాడు .పిమ్మట రాదామాధవులను సంస్తుతించాడు .ఇలా ఇంతవరకు ఏకవీ చేయలేదని శ్రీనాదుడే దీనికి నాన్దిపలికాడని ముందే చెప్పుకొన్నాం .ఆపద్య వైభవం చూద్దాం –

‘’వాలిక మోము మత్తవన బర్హి కిషోర లాస్య లీల బై –వాలిచి ,పచ్చకప్పురపు వాసన తోడి ముఖార వింద తాం

బూలపు మోవి ,మోవిపాయి మోపుచు రాధకు నిచ్చు ధూర్త గో—పాలుడు ప్రోచుగావుట మాపార కృపామతి మంత్రి యన్నయన్ ‘’

భావం –మదించిన అడవి నెమలి పిల్ల లాస్య నిన్యాసాన్ని అనుకరిస్తూ ,తన కోల ముఖాన్ని  రాధ ముఖం పై ఆనించి ,పచ్చ కర్పూరం దట్టించిన తాంబూలం తో తన పెదవిని ముద్దు కోసం రాధకు ఇచ్చే కొంటె కృష్ణుడు ,అపారమైన దయతో అన్నయ మంత్రిని రక్షించుగాక .ఈ విధం గా తెలుగు సాహిత్యం లో రాధాకృష్ణుల ప్రేమను మొట్ట ప్రవేశ పెట్టిన ఘనత పొందాడు శ్రీనాధుడు .

వెంటనే సరస్వతీ స్తవం చేశాడు .’’బ్రహ్మ దేవుని పట్టపు రాణి ,హంస వాహన ,బంగారు వీణను వాయించు రమణీ మణి ,పద్నాలుగు విద్యలకు ఆలవాలమైంది ,పద్నాలుగు లోకాలను పరిపాలించేడి మహా రాజ్ఞి ,చంద్ర రేఖను సిగ పూవుగా దాల్చిన సుందరి ,తెల్లని చిన్నారి రామ చిలుకను ఇష్ట సఖిగా కలిగినది ,ఓంకారం అనే పీఠం పై నివసించేపద్మ గంధి ,దేవకాంతల మ్రొక్కులు అందుకొనే సరస్వతీ దేవి –పాల  సముద్రం యొక్క అలలను సైతం పీడింపగల సాహిత్య సౌహిత్య లక్ష్మిని మాకు అనుగ్రహించుగాక ‘’.

ఈ విధం గా ముఖ్య దేవతలను స్తుతించి కవి తనకు పూర్వం ఉన్న కవీన్ద్రులను సంస్మరించాడు .ముందు వాల్మీకిని శ్లాఘించాడు –

‘’శ్లోకంబుల్ శతకోటి  గాండములుగా సూత్రించి రామాయణం –బేకాక్షర మెల్ల పాపముల మాయింపంగ నిర్మించి ,సు

శ్లోకుం డైన పురాణ సంయమి వరున్ జూతున్మనో వీధి ,వా-ల్మీకిన్ బ్రహ్మ పదావ తీర్ధ కవితా లీలావతీ వల్లభున్ ‘’

‘’అసం ఖ్యకాలైన  శ్లోకాలను  కాండాలుగా కూర్చి ,ప్రతి అక్షరం పాపాలను  హరిం చేట్లుగా రామాయణ మహా కావ్యాన్ని రచించి మంచి కీర్తి పొందిన వాడు ,ప్రాచీన మహర్షి సత్తముడు ,బ్రహ్మ దేవుని అనుగ్రహం తో కవితా విలాసినికి ప్రియ పతియైన వాల్మీకి ని నా మనసులో తలుస్తాను ‘’.తరువాత వ్యాస మహర్షినీఘనం గా ప్రస్తుతించాడు

‘’తలతున్ భారత సంహితాధ్యయన విద్యా నిర్మిత ప్రక్రియా –నలిన ప్రోద్భ వునిన్ ,గళింగ తనయాం తర్వేది ,పుణ్య స్థలీ

పులినాభోగా క్రుతావ తారు ,నపరాంభోజాక్షు  ,నక్షీణ ,ని –ర్మల సాహిత్య కళా  సమృద్ధికయి పారాశర్య మౌనీశ్వరున్ ‘’అంటే ‘’పంచమ వేదమైన భారత రచనా ప్రక్రియకు సృష్టికర్త అయిన బ్రహ్మ వంటి వాడు ,యమునా నది మధ్య ద్వీపం లోని పవిత్ర ఇసుక స్థలి పై జన్మించిన వాడు ,విష్ణు స్వరూపుడు ,పరాశర మహర్షి కుమారుడు అయిన వ్యాస మహర్షిని అనంతమైన సాహితీ కళా సమృద్ధి కోసం ధ్యానిస్తాను ‘’

ఇప్పుడు కాళిదాసాది కవుల ప్రతిభా విశేషాలను కొనియాడాడు –రసభావాలను పోషించటం లో మహనీయ కవితా విలాసుడు కాళిదాసుని,నిర్దుష్టమైన గద్యం తో ఈశ్వరునినే మెప్పించిన బాణ భట్టును ,సాహిత్యం అనే మహా సామ్రాజ్య సింహాసనాన్ని అస్దిస్తించిన ప్రవర సేనుడిని ,సముద్ర తరంగాల్లాగా గంభీర ,సారవంతాలైన పలుకులగొప్పతనం ఉన్న శ్రీ హర్షుని ,భాణుడు శివ భద్రుడు ,సౌమిల్లుడు ,భాల్లుడు ,మాఘుడు ,భారవి ,బిల్హనుడు ,మల్హనుడు ,భట్టి ,చిత్తపకవి ,దండి కవులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ‘’

ఇందులో ప్రవర సేనుడు పద్నాలుగో శతాబ్దం కవి .మహా రాష్ట్ర ప్రాకృతం లో ‘’సేతు బంధం ‘’పద్య కావ్యం రాశాడు .శివ భద్రుడు ఏమి రాశాడో తెలియటం లేదు. సౌమిల్లుడు ‘’శూద్రక మహా రాజు ‘’కధను రాసినట్లు బిల్హనుడు చెప్పాడు .ఇతని సోదరుడు రోమిల్లుడు .భల్లుడు కాశ్మీర కవి భల్లాట శతక కర్త. క్రీ శ ఎనిమిది వందల ఎనభై మూడు నుండి తొమ్మిది వందల రెండు వరకు ఉన్నాడు .భిల్హనుడు విక్రమాంక చరిత్ర రాశాడు మల్హనుడిగురించి తెలియ రాలేదు .చిత్తపకవి ‘’శివ స్తుతి ‘’రాశాడు.

శ్రీనాధుడు తర్వాత నన్నయ ,తిక్కనను ,తన తాత కమల నాభుడిని  కీర్తించాడు .సుకవులను స్తుతించి కుకవులను ఈ కావ్యం లోనే మొదటి సారిగా నిందించాడు  .కాకి మూక చుట్టూ చేరి చెవులు పగిలేట్లు నిరంతరం గా గోల చేసినంత మాత్రాన రాజహంస ఏమీ మాట్లాడకుండా ఉంటుంది .సహించలేని స్తితి వస్తే అదే ఇంకో చోటుకు పోవటం ఉత్తమం అన్నాడు రాజ మహేన్ద్రవరం లో అసూయాగ్రస్తులైన కవులు తనను పెట్టిన ఇబ్బందులను తలచుకొంటూ ఇలా చెప్పిఉంటాడు .

చివరికి తన భాష గురించిఒక పద్యం లో వివరించాడు

‘’ప్రౌఢి బరి కింప సంస్కృత భాష యండ్రు –పలుకు నుడికారమున నాంధ్ర భాష యందు

రేవ్వరేమన్న నండ్రు గాకేల కొరత –నా కవిత్వంబు నిజాము కర్నాట భాష ‘’

‘’దీర్ఘ సమాసాలతో ప్రౌఢం గా నేను రాస్తే సంస్కృత భాష అన్నారు .సొగసులతో నుడికారం తో పలుకుబడులతో రాస్తే స్వచ్చమైన తెలుగుభాష అన్నారు .ఎవరికి ఎలా అని పించినా నేకేమి లోటు ?నిజం గా నా కవిత్వం కర్నాట భాష ‘’అని అసందిగ్ధం గా చెప్పుకొన్నాడు .కర్నాటక అంటే చెవులకు ఇంపు అయినది నది –కర్ణే –అటతి-ఇతి –కర్ణాటః.శాత వాహన రాజులలో శాతకర్ణి ,సుందర శాతకర్ణి మొదలైన వారున్నారు వీరికి కర్ణి రాజులని కూడా పేరుంది. కర్నిరాజులు పాలించిన దేశం కనుక కర్ణి నాడు ,కర్నాడు అయి కర్ణాటం అయిందనిమల్లంపల్లి సోమ శేఖర శర్మ గారు అభిప్రాయ పడ్డారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-14-ఉయ్యూరు

వ్యాఖ్యానించండి

Filed under విశేషాలు

శ్రీనాధ కవి సార్వ భౌమ కృత ‘’భీమేశ్వర పురాణ కధనం ‘’-1

శ్రీనాధ కవి సార్వ భౌమ కృత ‘’భీమేశ్వర పురాణ కధనం ‘’-1

సాహితీ బంధువులకు కార్తీక మాస శుభాభినందనలు .ఈ పుణ్య మాసం లో కవి సార్వ భౌముడు శ్రీనాధుడు రచించిన ‘’భీమేశ్వర పురాణం ‘’అనబడే ‘’భీమ ఖండం’’ విశేషాలను ఈ రోజు నుంచి ధారా వాహికం గా అందజేస్తున్నాను  .దీనికి ఆధారం డాక్టర్ శ్రీ గుండవరపు లక్ష్మీనారాయణ గారు రచించిన ‘’శ్రీ నాద మహాకవి విరచిత  ‘’శ్రీ భీమేశ్వర పురాణం ‘’(దక్షిణ కాశికావ్యాఖ్యాన సహితం ).అవసరమైన చోట్ల మాత్రమె రసవంతమైన మహాకవి పద్యాలను ఉదాహరిస్తూ ,సాధ్యమైనంతవరకు సరళ వచనం లో రాసే ప్రయత్నం చేస్తున్నాను .సమాదరిస్తారని భావిస్తున్నాను –దుర్గాప్రసాద్ .

ఉపోద్ఘాతం

ద్రాక్షారామాన్ని దక్షిణ కాశి అంటారు .స్వామి భీమేశ్వరుడు .అమ్మవారు మాణిక్యాంబ .ఇది పంచారామ క్షేత్రమే కాక శక్తి పీఠంకూడా అవటం తో ప్రసిద్ధి ఎక్కువ .శ్రీనాధుడు భీమేశ్వర స్వామి చరిత్రను భీమేశ్వర పురాణం గా ‘’ప్రౌఢ నిర్భర వయః పరిపాకమున ‘’రాశాడు .అంటే పక్వ దశలో అంటే సుమారు డెబ్భై వ ఏట రాశాడు .ఇందులో ఆరు ఆశ్వాసాలున్నాయి .రాజమహేంద్ర ప్రభువు వీరభద్రా రెడ్డి మంత్రి ‘’బెండ పూడి అన్నయ్యకు’’ అంకితం ఇచ్చాడు .ఈయన మనకవికి చుట్టం కూడా .

భీమేశ్వర పురాణం  అనేక విషయాలకు ప్రత్యేకత పొందింది .ఇందులో శ్రీనాధుడు 159సీస పద్యాలను రాయటమే కాకుండా సీసపద్యం చివర ఉండాల్సిన ఆట వెలది పద్యాలను రాయక పోవటం మరో విశేషం .అంతే కాక 16ఆటవెలదులనూ రాశాడు .ఇక్కడ ద్రాక్షారామం అట కత్తేలకు నెలవు అందుకే  ‘’ఆట వెలదుల ‘’తో ఆడుకొన్న దానికి గుర్తేమో .ఇన్ని ఆటవెలదులు ఆయన మరే ఇతర గ్రంధం లోనూ రాయలేదు .ఇంకో విశేషం ఏ గ్రంధం లోను అంతకు ముందు చేయని ‘’కుకవి నింద’’ఇందులో చేశాడు .వీటికి మించిన మరో విశేషం కూడా ఈ గ్రంధం లో ఉంది .అదే ‘’రాధామాధవ ప్రసక్తి ‘’ఈ ప్రసక్తి శ్రీనాధుడి గ్రందాలలోనే కాదు అప్పటికి ఏ తెలుగు సాహిత్య గ్రంధం లోనూ లేక పోవటం శ్రీనాదుడే దీనికి ఆద్యుడు అవటం విశేషాలకే విశేషం .

వ్యాసమహర్షి కాశీ నగరం లో శిష్యులతో ఉండేవాడు .ఒకసారి ఆయనకు, శిష్యులకు ఏడు రోజులు భిక్ష దొరక లేదు .కోపం వచ్చి కాషిని శపించ బూనుకొన్నాడు .దీన్ని తెలుసుకొన్న కాశీ విశ్వనాధుడు వ్యాసుని కాశీ నుండి బయటికి వెడల గొట్టుతాడు .కాశీని  వదిలి వెళ్ళటానికి ఏంతో మానసిక క్షోభ పడతాడు .తప్పని సరి అని తెలుసున్నాడు పార్వతీదేవి అనుగ్రహించి  దక్షిణ కాశి అయిన ద్రాక్షారామం చేరి అక్కిడి భీమేశ్వర మాణిక్యాంబలానే కాశీ విశ్వేశ్వర విశాలాక్షి లుగా భావిస్తూ సేవిస్తూ ఉండమని  చెప్పి పంపుతుంది .కాశీ వదలి శిష్య సమేతం గా దక్షిణాదికి బయల్దేరుతాడు వ్యాసుడు .దారిలో అగస్త్య మహర్షి ని దర్శిస్తాడు .వ్యాస ,అగస్త్యులు దాక్షారామం చేరి భీమేశ్వరుని సేవిస్తారుర .వ్యాసుడు అక్కడే ఉండిపోయి భీమేశ్వరుని సేవలో మునిగి పోయి చివరికి  అనుగ్రహం పొందుతాడు.కద ఇంతే  .ఈ కధను ఆధారం చేసుకొని శ్రీనాధుడు తూర్పు గోదావరి మండలాన్ని తనివి తీరా వర్ణింఛి తన మాతృదేశ ఋణం తీర్చుకొన్నాడు .సామర్లకోట లోని కుమారారామం ,సర్పవరం ,సంపర గ్రామం ,పిఠాపురం మొదలైన ప్రదేశాలను కమనీయమైన పద్యాలతో వర్ణించి వాటికి ఉన్న శోభను ద్విగుణీకృతం చేశాడు .ఇది పురాణం అయినా ప్రబంధం లో ఉండాల్సిన  వర్ణనలన్నీ చేశాడు మహాకవి .ఎర్రాప్రగడ రాసిన ‘’నృసింహ పురాణం ‘’ మొదటి క్షేత్ర మహాత్మ్య గ్రంధం .శ్రీనాధుని భీమ పురాణం రెండవ క్షేత్ర మాహాత్మ్య గ్రంధం అయింది .’’ప్రాచీన ఆంద్ర కవులలో ఆంద్ర దేశాన్ని గురించి ,తాను  అనుకోకుండానే సమగ్రమైన రేఖా చిత్రాన్ని గ్రంధస్తం చేసిన కవి శ్రీనాధుడు ఒక్కడే ‘’ అని చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు ‘’శ్రీనాధ కృతి సమీక్ష’’లో తెలియ జేశారు .’’కధ లేకపోతేనేం కమ్మని వర్ణనలు ఉంటె చాలు అనే దృక్పధాన్ని ఆంద్ర సాహిత్యం లో ఈకావ్యం లో శ్రీనాధుడు ప్రవేశ పెట్టాడు ‘’అన్నాడు ఆరుద్ర .

‘’భీమేశ్వర పురాణం శ్రీనాధుని చేతిలో కావ్యం అయింది .శంకర ,మయూర ,భారవి రాజశేఖర ,సుబందు ,వామన భట్టు ,కాళిదాసు ,అమరుక కవి మొదలైన గీర్వాణ కవుల వాణి తెలుగు గొంతుకలో ఇందులో వినిపించాడు శ్రీనాధుడు .అసలు ఇది సంస్కృత పురాణానికి ఆంధ్రీకరణం కాదేమో అని పిస్తుంది .భౌగోళిక వర్ణనలతో తెలుగు సాహిత్యం లో వచ్చిన మొదటి స్వతంత్ర కావ్యం .సంస్కృత’’ భీమ ఖండం ‘స్వతంత్ర సంపూర్ణ రచన. భీమ ఖండం దాక్షా రామ భీమేశ్వర మహాత్మ్యం తొలిసారిగా చివరి సారిగా తెలుగు వారికి అందించిన కవి శ్రీనాధుడు ’కూడా శ్రీనాదుడే రాశాడేమో ? ‘’అని ఈ పురాణానికి అర్ధ తాత్పర్య వ్యాఖ్యానాలు రాసిన శ్రీ గుండవరపు లక్ష్మీ నారాయణ గారు భావించారు .

అసలు శ్రీనాధుడు తన గ్రంధాన్ని గురించి ఏం చెప్పుకున్నాడో చూద్దాం ‘’మహాస్కాందం అనే ఆది పురాణం లో గోదావరీ ఖండం ,శ్రీ దాక్షారామ భీమేశ్వర మహాత్మ్యం కలిసి ఉండటం వలన భీమేశ్వర పురాణం అని పేరొచ్చింది .దాన్ని ‘’ఆంద్ర భాషా ప్రబంధం ‘’గా చెప్పుతున్నాను .’’అని ప్రారంభం లో చెప్పాడు .కృతి భర్త అన్నయ్య భీమ పురాణం స్కాంద పురాణ సారం అయిన గోదావరీ ఖండానికి ఆంధ్రీకరణం అనీ అన్నాడు .ఇవన్నీ చూస్తె సంస్కృత భీమ ఖండం కాల గర్భం లో కలిసిపోతే ,ఆ తర్వాత శ్రీనాధుడి భీమఖండం సంస్కృతీక రింప బడి ఉంటుంది .లేక పొతే బెండపూడి అన్నయ్య ఆదేశం తో శ్రీనాదుడే తెలుగు లో ముందు రాసి, వెంటనే సంస్కృత భీమ ఖండాన్ని కూడా రాసి ఉంటాడు అని చెప్పిన ఆచార్య కొర్ర  పాటి శ్రీరామ మూర్తి గారి మాటలు విశ్వసనీయాలు .తన రచనా క్రమాన్ని శ్రీనాదుడే ‘’కాశీఖండం ‘’లో ఒక సీస పద్యం లో చక్కగా చెప్పుకొన్నాడు .ఆ పద్యం నోటికి రాని తెలుగు వాడు ఆనాడు ఉండేవాడుకాడు.

‘’చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు –రచి యించితి మరుత్తరాట్చరిత్ర

నూనూగు మీసాల నూత్న యౌవనమున –శాలివాహన సప్త శతి నుడివితి

సంత రించితి నిండు జవ్వనంబున యందు –హర్ష నైషద కావ్య భాష మాంధ్ర భాష

ప్రౌఢ నిర్భర వయః పరిపాకమున గొని –యాడితి భీమ నాయకుని మహిమ

ప్రాయ మింతకు మిగుల గైవ్రాల కుండ –గాశికా ఖండమను మహా గ్రంధ మేను

దెలుగు జేసెద గర్ణాట దేశి కటక –పద్మ వన హీలి శ్రీనాధ భట్ట కవిని ‘’.

శ్రీనాధుడు రాశాడు అని చెప్పబడే రచనలలో ‘’మరుత్త రాట్చరిత్ర ‘’,అలభ్యం ’’శాలివాహన సప్త శతి’’,లో ఒకే ఒక్క పద్యం  దొరికింది .మూడవది పండితారాధ్య చరిత్ర .ఇది పాల్కురికి సోమనాధుడు ద్విపదలో రాసిన దానికి ప్రాబంధ రూపం .దీన్ని మామిడి సింగన్న సోదరులకు అంకితమిచ్చాడు .నాలుగవది ధనుంజయ విలాసం అంటే కిరాతార్జునీయం .ఇదీ దొరకలేదు. అయిదవది నంద నందన చరిత్ర అంటే శ్రీకృష్ణ చరిత్ర .ఏదో ఉదాహరణ పద్యాలే తప్ప గ్రంధం ఆచూకీ లేదు .ఆరవది వల్లభాభ్యుదయం .ఇది  శ్రీకాకుళ ఆంధ్రదేవుని చరిత్ర కావచ్చునని ఊహిం చారు . ఏడవది కామ శాస్త్రం .దొరకనే లేదు ఎనిమిది-కాటమ రాజు కద.దాదాపు ఇవి అలభ్యాలో లేక సంపూర్ణాలో.

దొరికి, శ్రీనాధుడి రచనలుగా  భావింప బడేవి  ‘’పల్నాటి చరిత్ర ‘’.క్రీడాభిరామం ‘’, శివ రాత్రి మహాత్మ్యం .ఉన్నాయి పై పద్యం లో చెప్పినవి కాకుండా .

Inline image 1       Inline image 2  Inline image 3

రేపటి నుంచి అసలు కధలోనికి ప్రవేశిద్దాం

సశేషం

కార్తీక మాస శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -

 

వ్యాఖ్యానించండి

Filed under విశేషాలు

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం -శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరిరోజు విజయదశమి -శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం ,మరియు శమీ పూజ -శుక్రవారం -3-10-14

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం -శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరిరోజు విజయదశమి -శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం ,మరియు శమీ పూజ -శుక్రవారం -3-10-14

వ్యాఖ్యానించండి

Filed under దేవాలయం

శ్రీలలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -10-(చివరి భాగం )

శ్రీలలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -10-(చివరి భాగం )

‘’నిష్కారణా నిష్కలంకా నిరుపాదిర్నిరీశ్వరా-నీరాగా రాగమధనా నిర్మదామదనశినీ ‘’

నిష్కారణం గా ప్రత్యక్షమయ్యే ,ప్రసన్నురాలయ్యే దేవి స్వరూప స్వరూపాలు నిర్మలాలు .వాటిలో ఎటువంటి కళం కమూ ఉండదు .చంద్రుడిలో మచ్చ ఉండచ్చు కాని దేవి ముఖ మండపం  లో ,ఆలోచనల్లో ఆచరణలలో ఏ కల్మషమూ ఉండదంటారు ఇలాపావులూరివారు .దేవిని ఏ ప్రత్యెక లక్షణం గుణం ధర్మం లతో  గుర్తించలేం .లౌకిక అస్తిత్వ హద్దుల్లో ఈశ్వరీయ తత్వాన్ని బంధించలేముకదా .మనం ఏ భావం తో ఆమెను ఆరాధిస్తే ,ఆ భావనలో ఆమె వ్యక్తమవుతుంది .జలదేవత ,వన దేవత ,మేధా ,శ్రద్ధ ,శోభ ఏ రూపం లోనైనా పరదేవతను భావించ వచ్చు .మనస్వులైన వారి ప్రతి భావనలోను ,తలంపుల లోను మనోన్మణి అయిన లలితా దేవి మంగళ రూపం ప్రత్యక్షమౌతుంది .శ్రీమాత సమస్త జగత్తుకు  అధిష్టాత్రి దేవత ,సర్వేశ్వరి .ఆమె ఐశ్వర్యం సర్వోత్క్రుస్టం.ఎవరి ఐశ్వర్య ఆదిపత్యమూ ఆమె పై సాగదు .

ఇప్పటి నుండి రెండేసి నామాలు జంటలుగా వస్తాయి .’’నీరాగా-రాగమధనా ‘’’’,నిర్మదా –మదనాశినీ’’ లాగా .దేవి రాగద్వేషాలకు దూరం గా ఉండటమే కాదు ,వాటిని దూరం  చేస్తుంది కూడా .ఆమె నిగర్వి .ఇతరుల గర్వాన్ని ఖర్వం చేస్తుంది .అసలైన సంస్కర్త ముందు  తనను తాను సంస్కరించుకొనే వాడు .ఇది గొప్ప ఆదర్శం. ఆమె దానినేఆచరించి మనతో ఆచరింప జేస్తుంది .లక్షలాది ఉపదేశాలకంటే ఒక్క ఆచరణ గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది .ప్రేమ వలన ప్రేమ పెరుగుతుంది .ద్వేషం తో ద్వేషం వ్యాపిస్తుంది .మంచి గుణాలు మనం అలవాటు చేసుకొని ఆచరిస్తే లోకం కూడా ఆమార్గాన నడుస్తుంది అని ఈ నామాల విశిష్టతను తెలియ జేశారు శ్రీ ఇలపావులూరి పాండురంగా రావు గారు .

ఇప్పటికి సమాప్తం –వీలైనప్పుడు మళ్ళీ తెలుసుకొందాం .

ఈ పది వ్యాసాలకు ఆధారం ముందే తెలియ జేసినట్లు డా ఇలపావులూరి పాండురంగా రావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’.

దసరా శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-14-ఉయ్యూరు

 

 

వ్యాఖ్యానించండి

Filed under విశేషాలు

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శరన్నవ రాత్రి ఉత్సవాలు -ఎనిమిదో రోజు గురువారం 2-10-14-శ్రీ మహిషాసురమర్దిని అలంకారం 

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శరన్నవ రాత్రి ఉత్సవాలు -ఎనిమిదో రోజు గురువారం 2-10-14-శ్రీ మహిషాసురమర్దిని అలంకారం

వ్యాఖ్యానించండి

Filed under దేవాలయం

శ్రీలలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -9 ఏది పరమ సత్యం కాదు ?

శ్రీలలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -9

ఏది పరమ సత్యం కాదు ?

ఇది పరమ సత్యం అని చెప్పితే సరిపోదు .ఏది పరమ సత్యం కాదో తెలియ జెప్పాలి .శృతి ‘’సత్యమేవ జయతే నానృతం ‘’అని చెప్పింది .అలా చెప్పాలి దేవి విషయం లో కూడా .

‘’నిర్లేపా నిర్మలా నిత్య నిరాకారా ,నిరాకులా-నిర్గుణానిష్కలా శాంతా నిష్కామా నిరుపప్లవా ‘’

దేవి నిర్లిప్త స్వభావాన్ని చెప్పే నామం నిర్లేప .అన్నిటికీ యెంత దగ్గరో అన్నిటికీ అంతే  దూరం లో ఉంటుంది .అంతా చేస్తూ ఏమీ చేయనట్లు ఉంటుంది .కర్మాకర్షణకు దూరం గా  ఉండి కర్మ చేస్తే అది  నిర్లిప్తత .ఇది చేసేవాడీకేకాక   చూసేవాళ్ళకూ మహదానందం గా ఉంటుంది .నిర్లిప్త జీవనం పైనే పవిత్రత సాకారం అవుతుందంటారు ఇలపావులూరి వారు .నిర్లిప్తతతో మనసు నిర్మలమవుతుంది .నిర్మలత్వానికి మరోపేరు దివ్యత్వం .అందుకే పరమేశ్వరిని నిర్మల  అన్నారు .సాధకుడు క్రమం గా ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతుంటే జీవితం అనిత్యమనే భావన బలీయమవుతుంది .నిత్యత్వం గోచరిస్తుంది .అందుకే అమ్మ ను నిత్యా అన్నారు .మనస్తితిలో నిత్య రూపం లో దర్శన మిస్తుంది .జీవుడు అనిత్యం ,జీవనం మాత్రం నిత్యం .లీల అనిత్యం లీలకు మూలాధారం మాత్రం సత్యం నిత్యం .నిర్లిప్త ఆవరణ ,నిర్మల మనస్సు ఉంటె నిత్యాత్మ వెంటనే ప్రత్యక్షమౌతుంది .నిర్లేపా నిర్మలా ,నిత్య అనే మూడు నామాలు ఆచరణ ,ఆలోచన ,అస్తిత్వ ములయొక్క ఆధ్యాత్మిక మహాత్యాన్ని బోధిస్తున్నాయి .వీటి సంబంధం వరుసగా శరీరం ,మనసు ,ఆత్మా .దీనితో బాటు కర్మణా ,మనసా ,ఆత్మనా పరమేశ్వరిని సాక్షాత్కా రించు కోవటానికి ఉపాయం .

తర్వాత నామం ‘’నిరాకార ‘’దేవికి నిర్దుష్టమైన ఆకారం లేదు అందుకే ఆపేరు .రూపం మనిషిని క్షుద్రుని చేస్తుంది .నిరాకార  రూపం విరాట్ సౌందర్య  భావన కలిగిస్తుంది . విశాల విశ్రుత విశ్వ సౌందర్యం దేవి అనంత లావణ్య విస్తారమే అంటున్నారు పాండురంగా రావు గారు .రూపం వ్యాకులత కలిగిస్తుంది రూపమే లేకపోతె వ్యాకులతకు ఆస్కారమే ఉండదు .పరమేశ్వకి ఆకారమూ లేదు వ్యాకులతా లేదు .మనం కూడా ఆస్తితి చేరుకోవాలంటే వీటినే సోపానాలు చేసుకోవాలని సూచన .’’ఏకాంతం మనల్ని అనేకాంతం లోకి తీసుకు వెడుతుంది ‘’అని గ్రహించాలన్నారు డాక్టర్ గారు .దుఖం లో అణగిపోవటం సుఖం లో పరవశించటం ఉండదు ..శోక మొహాలులేని పరమేశ్వరిని అందుకోవాలంటే మనమూ అలానే ఉండాలి .

ఈ దశలో సాధకుడు గుణ దోషాలకు దూరమౌతాడు .అప్పుడు ఆర్యాదేవత గుణాతీతగా అనిపిస్తుంది. గుణం అనేదిమనసులో పుట్టేది .ఆత్మతో దానికి సంబంధం ఉండదు .నిర్మల మనసుతో ఈ స్తితికి చేరినప్పుడు గుణం గౌణం అవుతుంది .అందుకే  పరమేశ్వరి ‘’నిర్గుణ ‘’అన్నారు .అంటే గుణం లేక పోవటం కాదు .గుణాలకు అతీత అని అర్ధం ,గుణ నిరపేక్ష కావటం .గుణానికి దోషానికి దూరం గా ఉండే సహజ సద్గుణ భావన ను ఇది సూచిస్తుంది .తర్వాతినామం ‘’నిష్కలా’’.కళ ఏ అస్తిత్వాన్నైనా పరిమితం చేస్తుంది .పరమేశ్వరి పరమ అస్తిత్వం ఏ పరిమితికీ  లొంగేదికాదు . కళను కళాత్మకం చేసే కళావతి తానూ కళకు భిన్నమైనది .అందువల్ల నిష్కల .

అన్నిటిలో శాంత అనేది  సరళ సుందరమైన సారమైన నామం .ఇప్పటి వరకు వచ్చిన నామాలలో ఇది సార వంతమైన నామం అన్నారు.ఇలపావులూరివారు .నిర్లిప్త ఆవరణ ,నిర్మల మనస్సు,నిత్య అస్తిత్వం నిరాకారత్వం ,నిశ్చింతత మొదలైన వాటిఫలితం పరమ శాంతి .ఈ శాంత భావనలోనే పరమేశ్వరి నివాసం .ఇది తెలిసి మసలి ఆమెను చేరిన వారికి పరమ శాంతినిస్తుంది .అందుకే తరువాతినామం శాంతి భౌతిక ,మానసిక  ,ఆధ్యాత్మిక శాంతికోసం శాంతిమంత్రాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు తర్వాత నామాలు నిష్కామాన నిరుపప్లమా లు శాంతి సాధనాలను స్పష్ట పరుస్తాయి .అందరికోరికలే ఆమె కోరికలు .అలాంటి సార్వజనిక ,సామూహిక ఇచ్చ వల్ల  ప్రేరితుడై పని  చేసే సాధకుడు కూడా నిష్కాముడౌతాడు .కామేశ్వరి కృపకు దగ్గరౌతాడు .నిష్కామ భావన తో చేసే వాడికి విఘ్నాలు రావు .నిరుపప్లవ నామం తో విఘ్న నివారణ చెప్ప బడింది .

సశేషం

గాంధీజయంతి ,దుర్గాష్టమి ,మహర్నవమి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-14-ఉయ్యూరు

 

 

 

వ్యాఖ్యానించండి

Filed under విశేషాలు

శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో శరన్నవ రాత్రి ఉత్సవాలు .ఏడవ రోజు బుధవారం 1-10-14-శ్రీ సరస్వతి దేవి అలంకారం 

శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో శరన్నవ రాత్రి ఉత్సవాలు .ఏడవ రోజు బుధవారం 1-10-14-శ్రీ సరస్వతి దేవి అలంకారం

వ్యాఖ్యానించండి

Filed under దేవాలయం